Friday, May 30, 2008

సామెతలు 3

1. అబద్ధాల నోటికి అరవీశెడు సున్నం కావాల.
2. అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు.
3. అబ్బ చస్తే పొత్తు పంచ (పట్టు పంచ) నాది అన్నాడుట.
4. అబ్బ త్రవ్విస్తే అబ్బాయి పూడ్పించాడు.
5. అబ్బ పెంచిన బిడ్డ ఐనకావాల, అమ్మ పెంచిన బిడ్డ ఐనాకావాల, ముండ పెంచిన బిడ్డ మండలాధిపతి అవుతాడా?
6. అబ్బరాన బిడ్డపుడితే ఆముదం తో ముడ్డి కడిగిందిట.
7. అబ్బలేని బిడ్డ, గట్లు లేని చేను.
8. అబ్బలేని బిడ్డ, మబ్బులేని (విడిచిన) ఎండ.
9. అబ్బాయి పోతురాజు, అమ్మయి గంగానమ్మ.
10. అబ్బితే సిగ, అబ్బకపోతే కాళ్ళు.
11. అబ్బురాన అబ్బికి మీసాలు వస్తే, అవి ఈచేతా ఆ చేతా సాగతీసె సరికి ఊదిపోయినవట. వట్టి మూతికి ఒక చేయి చాలునని రెండోదానితో తల గోక్కున్నాడట.
12. అబ్బురాన బిడ్డ పుట్టింది, గడ్డపార తేరా చెవులు కుడతాను అన్నడుట.
13. అభాగ్యునికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ.
14. అభ్యాసం కూసువిద్య.
15. అభ్యాసం లేని రెడ్డి అందలం ఎక్కితే అటు ఇటు అయ్యిందట.
16. అమర్చిన దానిలో అత్త వేలు పెట్టినట్లు.
17. అమావాశ్యకు అట్లు, పున్నానికి బూరెలు.
18. అమావాశ్య నాడు ఎందుకు కయ్యానికి దిగినావంటే, ఎదిరివాడికి అచ్చిరాకుండాను అన్నట్లు.
19. అమ్మ కడుపు చూస్తుంది, ఆలు వీపు చూస్తుంది.
20. అమ్మతాపెట్టదు, అడుక్కుతినా నివ్వదు.
21. అమ్మను తిడతావేమిరా, లంజాకొడకా అన్నడుట.
22. అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక.

23. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు.
24. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు.
25. అమ్మ పెట్టేవి నాలుగు అప్పుడే పెడితే ఆ పని చేయనా -అన్నడుట.
26. అమ్మ పెట్టేవి నాలుగూ పెడితే గాని, కుదరదు.
27. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి.
28. అమ్మయినా అడగందే పెట్టదు.
29. అమ్మవారి మొక్కుతీరదు, ఆడబిడ్డ అప్పు తీరదు.
30. అమ్మానీ అల్లుడు వచ్చాడంటే, నన్నేమి చేస్తాడమ్మ: నిన్నే తీసికెల్తాడు అన్నట్లు.
31. అమ్మ, బాబు పిచ్చి గాని నాకు చదువు వస్తుందా?
32. అయితే అవతలి ఒడ్డు, కాకుంటే ఇవతలి ఒడ్డు.
33. అయితే ఆడుబిడ్డ, లేకుంటే మగబిడ్డ.
34. అయితే ఆదివారం, కాకుంటే సోమవారం.
35. అయితే అమీరు, కాకుంటే గరీబు.
36. అయిన పెండ్లికి మేళమా?
37. అయినోణ్ణి అడిగేదానికంటే, కానోణ్ణి కాళ్ళు పట్టుకొనేది మేలు.
38. అయిదోవతనం లేని అందం అడుక్కుతిననా?
39. అయిదు శిఖలున్న ఇబ్బంది లేదు కాని, మూడు కొప్పులుచేరాయంటే ముదనస్టమే.
40. అయిదేళ్ళ పిల్ల అయినా, మూడేళ్ళ పిల్లాడికి లోకువే.
41. అయిన వాడిని ఆశ్రయించేకంటే, కానివాడి కాళ్ళు పట్టడం మేలు.
42. అయినవాళ్ళకు ఆకులలోనూ, కానివాళ్ళకు కంచాలలోను.
43. అయినవాళ్ళను అవతలకి నెట్టి కానివాళ్ళ కాళ్ళు పట్టుకొన్నట్లు.
44. ఆయుష్యం గట్టిగా ఉంటే, అడవిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా ఒక్కటే.
45. అయ్యకు ఆరటమేగాని పోరాటం తక్కువ.
46. అయ్యకు రెండు గుణములు తక్కువ- తనకుగా తోచదు, ఇంకొకరు చెపితే వినడు.
47. అయ్యకు రెండో పెండ్లి అని సంతోషమే కాని. అమ్మకి సవతి పోరని ఎఱగడు.
48. అయ్యకు వణకు ప్రాయం, అమ్మకు కులుకు ప్రాయం.
49. అయ్యకు విద్యా లేదు, అమ్మకు గర్వం లేదు.
50. అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది.
51. అయ్య తిరుపతి, అమ్మ పరపతి.
52. అయ్య దాసర్లకు పెట్టితే, అమ్మ జంగాలకు పెట్టిందట.
53. అయ్య దేశసంచారం, అమ్మ గ్రామ సంచారం.
54. అయ్యవారి గుఱ్ఱానికి అన్నీ అవలక్షణాలే.
55. అయ్యవారి జందెం అయ్యవారికే ముప్పు.
56. అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు.
57. అయ్యవారు తప్పులు చేసి దిద్దుకుంటు ఉంటే, అమ్మగారికి పారబోయను ఎత్తనూ, ఎత్తనూ పారబోయను.
58. అయ్య సవాసేరు, లింగమరవీసెడు.
59. అయ్యేదాకా అరిసెల పాకం. అయినతరవాత బూరెలపాకం.
60. అయ్యేది లేదు, పోయ్యేది లేదు, వీరభద్రప్పా నా ఎనిమిది అణాలు నాకిచ్చి, నీ అర్థరుపాయి నీవు తీసుకో.
61. అయ్యో అంటె ఆరు నెలల పాపం వస్తుంది.
62. అరకాసు పనికి ముప్పాతిక బాడిగ.
63. అరఘడియ భోగం, ఆరునెలల రోగం.
64. అరగదీసిన గందపు చెక్కకి వాసన తగ్గునా?
65. అరిచే కుక్క కరవదు.
66. అరచేతులో బెల్లం పెట్టి మోచేతి వఱకు నాకించినట్లు.
67. అరచేతిలో వైకుంఠం చూపినట్లు.
68. అరటాకు మీద ముల్లుపడ్డా ముల్లు మీద అరటాకు పడ్డ అరటాకుకే ముప్పు.
69. అరటికాయ ఆరునెలల రోగం.
70. అరటి చెట్లు రెండుసార్లు గెలవేయునా?
71. అరటిపండు ఒలవను ఇనుపగోళ్ళూ కావలెనా?
72. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు.
73. అరనిముషం తీరికాలేదు, అరకాసు సంపాదనాలేదు.
74. అరనిముషం భోగానికి ఆరునెలల రోగం.
75. అరవై ఊళ్ళకు అములుదారుడు కూడా ఆలికి దాసుడు.
76. అరిసె ఆరునెలల రోగం బయలేస్తుంది.
77. అరుంధతీ గిరుంధతీ కనపడుటలేదు కాని, ఆరువందల అప్పుమాత్రం కనపడుతున్నది.
78. అరువు సొమ్ములు బరువుచేటు, తీయ్యబెట్టా తీపుచేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు.
79. అరువుల సొమ్ము అరువులవాళ్ళెత్తుకుపోతే పెండ్లికొడుకుముఖాన్న పేడనీళ్ళు చల్లినట్లయిందట.
80. అర్ధబలం కంటే, అంగబలం ఎక్కువ.
81. అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు.
82. అర్ధరాత్రివేళ, మద్దెల దరువులు.
83. అర్ధశేరు బియ్యం తింటావురా? అంటే మూడు మెతుకులు విడిచి పెడతానన్నాడుట.
84. ఆర్జీలకు పనులుకావు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టారు.
85. అలంకారం కంటె, అయిదవతనం మేలు.
86. అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనుడికేమీ దక్కదు.
87. అలవాటులేని అగ్నిహోత్రాలు చేస్తే మూతి మీసాలు తెగ కాలినవట.
88. అలవాటు లేని ఔపాసన చేస్తే మూతి మీసాలు తెగకాలినవి.
89. అలవిగాని ఆలిని కట్టుకొని మురిగి చచ్చెరా ముండాకొడుకు.
90. అలవి మీరితే అమృతం అయినా విషమే.
91. అలసిసొలసి అక్కపక్కలోకి వస్తే, అక్క ఎత్తుకపోయి బావపక్కన వేసిందిట.
92. అలిగి అత్తవారింటికి, చెడి చెల్లెలింటికి పోరాదు.
93. అలిగి అల్లుడు చెడ్డాడుట, కుడువక కూతురు చెడ్డదట.
94. అలిగిన ఆలు, తడిసిన మంచము బిగుసుకుంటవి.
95. అలిగి నలుగురిలో కూర్చుంటె అలుక తీర్చే అయ్య ఎవరు?
96. అలక పానుపు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారుపడినట్లు.
97. అల్పవిద్వాంసుడు ఆక్షేపణకు పెద్ద.
98. అల్పనరులకెల్ల నతివలపై చింత.
99. అల్పుడికి ఐశ్వర్యం వస్తే, అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడుట.
100. అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను.

Tuesday, May 27, 2008

సామెతలు 2

1. అత్తలేని కోడలుత్తమురాలు, కోడలులేని అత్త గుణవంతురాలు.
2. అత్త వల్ల దొంగతనము, మగనివల్ల ఱంకుతనము (నేర్చుకోన్నట్లు).
3. అత్తవారింటికి అల్లుడైనా రావాలి, ఆబోతైనా రావాలి.
4. అత్తవారింటి ఐశ్వర్యంకన్నా పుట్టింటి గంజి మేలు.
5. అత్తవారింటి లేమి అల్లుడెరుగు.
6. అత్తవారింట సుఖం మోచేతి దెబ్బ వంటిది.
7. అత్త సొమ్ము అల్లుడు ధారవోసినట్లు (దానం చెసినట్లు).
8. అత్తది అల్లుడు దానం చేసినట్లు.
9. అత్త ఒకింటి కోడలే, మామా ఒకింటి అల్లుడే.
10. అత్త నీ కొంగు తప్పిందన్న తప్పే, లేదన్న తప్పే (ఊరకున్నా తప్పే).
11. అత్తింటి కాపురం కత్తిమీది సాము.
12. అదను ఎఱిగి సేద్యం, పదును ఎరిగి పైరు.
13. అదిగోపులి అంటె, ఇదిగో తోక అన్నట్లు.
14. అదిగో పులి అంటె తోక తొంబై ఆమడ అన్నట్లు.
15. అదుపుకురాని ఆలిని, అందిరాని చెప్పుని విడవమన్నారు.
16. అదృష్టం ఉంటే చేయిజారిపోయేది కూడా చేతికి వస్తుంది.
17. అదృష్టం కలిసివస్తే అదే (ఆలే) పెండ్లామవుతుంది.
18. అదృష్టం చాలని ఆడుబిడ్డను అక్కఱలెని అల్లునికిచ్చి, అమావాస్య ఆదివారం నాటి ఆరుద్రానక్షత్రాన అతివైభవంగా వివాహం జరిపినట్లు.
19. అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు.
20. అదృష్టం పండితే ఆరునూరవుతాయి.
21. అదృష్టం అందల మెక్కిస్తాను అంటే, బుధ్ధి బురదలోకి లాక్కెళిందంట.
22. అదృష్టవంతుడిని చెరిపేవారు లేరు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవారు లేరు.
23. అద్దం ఉంది అందమడుగనేల?
24. అద్దం మీద అలిగి, ముక్కుగోసుకున్నట్లు.
25. అద్దం లో నీడకు ఆశ పడరాదు.
26. అద్దెకు వచ్చిన గుఱ్ఱాలు అగడ్తలు దాటునా?
27. అద్వైతులు వస్తున్నారు చెంబు తప్పేళా జాగర్త (జాగ్రత్త) చెయ్యండి.
28. అధమునికి ఆలు అయ్యేకంటే, బలవంతునికి బానిస అయ్యేదిమేలు.
29. అధర రసము చూచి అన్నీ మరచును.
30. అధికారం ఆరుపాళ్ళయితే, బొచ్చు మూడుపాళ్ళు.
31. అధికారికి చెవులుంటయేగాని, కళ్ళు ఉండవు.
32. అధికాశ లోకదరిద్రం.
33. అనంతయ్య చేతి మాత్ర, వైకుంఠయాత్ర.
34. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం.
35. ఆనపచేను ఆమడుండగానే బుఱ్ఱు పిత్తులు మొదలైనట్లు.
36. అనిత్యాని శరీరాణి, అందరి సొమ్ములు మనకేరానీ.
37. అనుభవం ఒకరిది, ఆర్భాటం ఇంకొకరిది.
38. అనుభవమే శాస్త్రం, మాటలే మంత్రాలు.
39. అనుమానం ప్రాణసంకటం.
40. అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది.
41. అనుమానపు మొగుడు ఆలిని వీపున కట్టుకుంటే, పెండ్లాము మిండ మగని కొప్పులో పెట్టుకొన్నదిట.
42. అనుములు తిన్న తరువాత పిత్తులకి వెరిస్తే ఎట్లా?
43. అనువుగాని చోట అధికులమనరాదు.
44. అనువుగానిచోట పుండు, అల్లుడి వైద్యం, చెప్పుకుంటే ప్రాణం పోతుంది.
45. అనూరాధ కార్తెలో అనాధ కఱ్ఱ ఐనా ఈనుతుంది.
46. అనూరాధలో తడిస్తే ఆడది మగవాడవుతాడు.
47. అన్నం అడిగినవాడికి సున్నం పెట్టినట్లు.
48. అన్నం ఉడికిందో లేదో అంతా పట్టి చూడనక్కరలేదు.
49. అన్నం ఊడికినాక పొయ్యి మండుతుంది.
50. అన్నం ఎక్కువైతే ఆచారమెక్కువ, ఆచారమెక్కువైతే గ్రహచారం తక్కువ.
51. అన్నం తిన్నవాడు, తన్నులు తిన్నవాడు మరచిపోడు.
52. అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, కఱ్ఱుకాల్చి వాతపెడితే కలకాలం ఉంటుంది అన్నట్లు.
53. అన్నం పెట్టిన వారింటికి కన్నం పెట్టినట్లు.
54. అన్నం లేకపోయిన పట్టుబట్ట.
55. అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అక్కచెళ్ళెల్లపొత్తు పెద్దప్పుడు.
56. అన్నదమ్ముల శత్రుత్వం, అక్కచెళ్ళెళ్ళ మిత్రత్వం.
57. అన్నదమ్ములలో కడపటివాదికంటే, అడవిలో మానై పుట్టడం మేలు.
58. అన్నదీక్షఏకానీ, అక్షరదీక్షలేదు.
59. అన్నద్వేషం, బ్రహ్మద్వేషం పనికిరావు.
60. అన్నం అరఘడియలో అరుగుతుంది, ఆదరణ శాశ్వతంగా ఉంటుంది.
61. అన్నరసం కన్న, ఆదరణ రసం మేలు.
62. అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడిపోయింది.
63. అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు, నడుమ ఉన్నవారే నలిగిచచ్చారు.
64. అన్నానికి ఆధారం లేదుగానీ,అందఱికి పంక్తి భోజనమట.
65. అన్నానికి పదును తప్పినా, భూమికి అదను తప్పినా పనికిరావు.
66. అన్ని రుచులు సరే గానీ, అందులో ఉప్పులేదు.
67. అన్నీ అమర్చిన తరువాత అత్తగారు వేలు పెట్టినట్టు.
68. అన్నీ అయిన తరువాత అగ్ని వైద్యం.
69. అన్నీ ఉన్న విస్తరి అణగిమణగి ఉంటుంది, ఏమిలేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.
70. అన్నీ ఉన్నాయిగానీ ఆనవాయతీ లేదు.
71. అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందంట.
72. అన్నీ తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూలేడు.
73. అన్నీ వడ్డించిన రైతుకు అన్నమే కఱువు.
74. అన్నీ సాగితే రోగమంత భోగం లేదు.
75. అన్యాయపు ఊరిలో ఆలూ మొగుడికే ఱంకు.
76. అపండితుడి కంటె, అర్థపండితుడే అపాయకరం.
77. అన్ని ఉన్నయిగాని ఐదవతనం లేదు.
78. అపానవాయువు వదలితే - అర్జునః ఫలునః, కిరీటీ, శ్వేతవాహనః - అని అదిరి పిడుగు మంత్రం చదివినట్లు.
79. అపుత్రస్య గతిర్నాస్తి.
80. అప్ప అర్భటం, బావ బడాయేగానీ, ఆకలివేస్తే అన్నం మెతుకులేదు.
81. అప్ప చెల్లెలు బ్రతుకగోరితే, తోడికోడలు చావు కోరుతుంది.
82. అప్పటికి దుప్పటి ఇచ్చాముగానీ కలకాలం ఇస్తామా?
83. అప్పని జూడబోతే ఱెప్పలు పోయినవి.
84. పానవాయువు అణచిపెడితే, ఆవులింత ఆగునా?
85. అప్పు ఆరుతెన్నులు, ముప్పు మూడు తెన్నులు.
86. అప్పు ఇచ్చి చూడు, ఆడపిల్ల ఇచ్చి చూడు.
87. అప్పు ఇచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడుకోరును.
88. అప్పు చేసి ఆవును కొనవచ్చును గాని గేదెను కొనరాదు.
89. అప్పు చేసి పప్పు కూడు.
90. అప్పుతీర్చి అంగట్లో కాపురం చెయ్యాలి.
91. అప్పులవాని నమ్ముకొని అంగడికిపోరాదు, మిండని నమ్ముకొను జాతరకి పోరాదు.
92. అప్పులున్నవాడివెంట, చెప్పులున్నవాడివెంట పోరాదు.
93. అప్పులేనిదే ఒక ఐశ్వర్యం.
94. అప్పులేనివాడు అధిక బలుడు.
95. అబద్ధం అంటే అతుకుల మాట
96. అబద్ధం చెప్ప్తే నిజం చెప్పేవాడి కంట్లో మిరప్పొడి కొట్టినట్లుండాల.
97. అబధం చెప్పితే నిజం ముడ్డిలో మేకు కొట్టినట్లుండాల.
98. అబధం చెప్పితే అన్నం పుట్టదు, నిజం చెప్పితే నీళ్ళు పుట్టవు.
99. అబధానికి అంతు లేదు, అమ్మగారికి చింత లేదు.
100. అబధమాడితే గోడ పెట్టినట్లుండవలె.

Friday, May 23, 2008

సామెతలు 1

1. అంగట్లో అన్ని ఉన్నవి, అల్లుని నోట్లో శని ఉన్నది.
2. అంగట్లో అరువు, తలమీద బరువు.
3. అంగట్లో అష్టభాగ్యం, అల్లుడి నోట్లో శనేశ్వరం (అష్ట దరిద్రం).
4. అంగట్లో ఎక్కువైతె ముంగిట్లోకి వస్తుంది.
5. అంగట్లో బెల్లం గుళ్ళోలింగానికి నైవేద్యం.
6. అంగడిలో అమ్మి గొంగడి (కప్పు) కొన్నట్టు.
7. అంగడిమీద చేతులు, అత్తమీద కన్ను.
8. అంగడివీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టినావురా కొడకా అన్నట్లు.
9. అంగడివీధిలో ఆలిని పడుకోపెట్టి, వచేవాళ్ళూ పోయేవాళ్ళూ దాటిపోయినారు అన్నట్టు.
10. అంచు డాబే గాని, పంచె డాబులేదు.
11. అంటే ఆరడి అవుతుంది, అనకపోతే అలుసవుతుంది.
12. అండలుంటె కొండలు దాటవచ్చు.
13. అంతంత కోడికి అర్థసేరు మసాలా.
14. అంతా ఉరిమి ఇంతేనా కురిసేది?
15. అంతకు ఇంతయింది, ఇంతకెంతవుతుందో, ఇంతకింతే!
16. అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత.
17. అంతనాడులేదు, ఇంతనాడూలేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు.
18. అంత పెద్ద కత్తి ఉన్నదే, గొరుగలేవా అన్నట్లు.
19. అంత పెద్ద పుస్తకం చంకలో ఉన్నదే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.
20. అంతములేని చోటులేదు, ఆదిలేని ఆరంభములేదు.
21. అంతర్వేదికి అవతల అసలే ఊళ్ళులేవు.
22. అంతా తడిసిన తరువాత చలేమిటి.
23. అంతా తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూ లేడు.
24. అంతా అయినవాళ్ళే, మంచినీళ్ళు పుట్టవు.
25. అంతా బావలే! అయితే, కోడిపెట్ట ఏమైట్లు?
26. అంతా మావాళ్ళే గానీ అన్నానికి రమ్మనేవాళ్ళులేరు.
27. అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు.
28. అందని ద్రాక్షపళ్ళు పుల్లన.

29. అందని ఫూలు దేవికర్పణ.
30. అందని మానిపళ్ళకు ఆశపడ్డట్లు.
31. అందఱికన్న తాడిచెట్టు పెద్ద.
32. అందఱికి శకునం చెప్పే బల్లి, తానుపోయి కుడితిలో పడ్డట్లు.
33. అందఱికి అట్ల పండుగ, మనకి ముట్ల పండుగ.
34. అందరికి అన్నం పెట్టేవడు రైతు.
35. అందరికి అన్ని రోగాలు, అడ్డెడు తప్పలాకు ఏ రోగములేదు.
36. అందఱిని మెప్పించటం అలవిగానిపని.
37. అందఱు అందలమెక్కితే, మోసేదెవరూ?
38. అందఱూ అహింసాపరులే, అయితే కొడిపెట్ట ఎక్కడపోయినట్టు?
39. అందఱు శ్రీవైష్ణవులే, బుట్టెడు రొయ్యలెగిరిపోతున్నయి.
40. అందలంలో పెట్టినా, కుక్క ఎంగిలాకులు నాక ఇలకుదూకు.
41. అందితే సిగ, అందకపోతే కాళ్ళు.
42. అందిన తియ్యన, అందకుంటె పుల్లన.
43. అంధునికి అద్దం చూపినట్లు.
44. అంబటి ఏరు వచ్చింది అత్త గారు అంటె కొలబుఱ్ఱ నా చేతిలోనే ఉన్నది కోడలా అన్నదిట.
45. అంబనపూడి అప్పయ్యదీ బట్టతలే, నా మొగుడుదీ బట్టతలే! కాని, అప్పయది ఈశ్వర్యపు బట్టతల నా మొగుడిది పేను కొరికిన బట్టతల.
46. అంబలి తాగేవాడికి మీసాలెగపెట్టేవాడొకడా.
47. అంభంలో కుంభం, ఆదివారం లో సోమవారం.
48. "అ ఆ " లు రావు అగ్రతాంబూలం కావాల
49. అక్క ఆరాటమె కాని, బావ బతకడు.
50. అక్కాచెళ్ళెళ్లకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు.
51. అక్కఱ ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కఱ తీరితే గూద నారాయణ.
52. అక్కఱకు వచ్చినవాడే అయినవాడు.
53. అక్కఱ తీరితే, అల్లుడు తొత్తుకొడుకు.
54. అక్కఱ తీరితే, అక్క మొగుడు కుక్క.
55. అగ్గికి పోయినమ్మ, ఆరునెలల కడుపుతో వచ్చినట్టు.
56. అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లు.

57. అగ్గువ అయితే అంగడికి వస్తుంది.
58. అగ్గువ అయితే అందరూ కొంటారు.
59. అగ్నికి వాయువు తోడైనట్టు.
60. అగ్ని దేవుడు చలి కాలంలో చంటివాడు, ఎండాకాలం లో ఎదిగినవాడు.
61. అగ్నిలో ఆజ్యం పోసినట్లు.
62. అగ్ని శేషం, ఋణశేషం, శత్రుశేషం, వ్రణశేషం ఉంచరాదు.
63. అగ్రహారం పోయిందికానీ, ఆక్టు బాగతెలిసింది.
64. అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం.
65. అచ్చమైన సంసారి ఉచ్చపోసి ఇల్లలికిందిట.
66. అచ్చిపెళ్ళి బుచ్చి చావుకు వచ్చింది.
67. అచ్చివచ్చిన భూమి అడుగడే చాలు.
68. అచ్చిరాని కాలానికి అడుక్కతినబోతే, ఉన్న బొచ్చికాస్తా ఊడ్చుకొనిపోయిందిట.
69. అచ్చుబోసిన ఆబోతువలే (వ్యభిచారిగా తిరుగుటకు).
70. అటుకులు బొక్కే నోరు, ఆడిపోసుకునే నోరు ఊరుకోవు.
71. అటునుంచి నరుక్కురమ్మన్నారు.
72. అట్టే చూస్తే అయ్యవారు కోతిలా కనపడతారు.
73. అడక్కుండ చెప్పులిచాడు, అడిగితే గుఱ్రమిస్తాడని అనుకొన్నట్లు.
74. అడగనిదే అమ్మయినా పెట్టదు.
75. అడవిపంది చేనుమేసిపోతే, ఊరపంది చెవులు కోసినట్లు.
76. అడవిని గాచిన వెన్నెల, ముదిమిని చేసున పెండ్లి.
77. అడిగితే చిరాకు, అడుగకపోతే పరాకు.
78. అడిగినట్లు ఇస్తే, కడిగినట్టు పోతుంది. (బేరంలో).
79. అడిగేవాడికి చెప్పేవాడులోకువ.
80. అడుక్కొని తినేవాడి ఆలు అయ్యేకంటె, భాగ్యవంతుడి బానిస అయ్యేది మేలు.
81. అడుక్కొని తినేవాళ్ళకు అరవై ఊళ్ళు.
82. అతుకుల కాపురం, చిదుగుల మంటవంటిది.
83. అతుకుల బొంత, గతుకుల బాట.
84. అత్త కాలము కొన్నాళ్ళు, కోడలికాలం కొన్నళ్ళు.
85. అత్త ఎత్తుకొని తింటుంటే, అల్లుడికి మనుగుడుపా?
86. అత్తకు అల్లుడాశ, బాపనికి పప్పాశ.
87. అత్తకు మొగుడల్లుడు.
88. అత్తకు లేక అటికలు నాకుతుంటే, అల్లుడు వచ్చి దీపావళిపండుగ అన్నడుట.
89. అత్త కూడు వండమన్నదేకాని, కుండ పగలకొట్టమన్నదా?
90. అత్త కొట్టిన కుండ అడుగోటి కుండ. కోడలు కొట్టిన కుండ కొత్తకుండ.
91. అత్త చచ్చిన ఆరునెలలకు, కోడలు నిట్రాయి పట్టుకొని నిగిడినిగిడి ఏడ్చిందంట.
92. అత్త చేసిన పనికి ఆరళ్ళు లేవు.
93. అత్తను ఉంచుకొన్నవాడు ఆయుష్మంతుడు.
94. అత్తని కొట్టి అటకెక్కింది, మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కింది.
95. అత్తని కొడితే కోడలేడ్చినట్లు.
96. అత్త పెట్టే ఆరళ్ళు కనపడతాయి కాని, కోడలు చేసే కొంటెపనులు కనపడవు.
97. అత్త మీద కోపం దుత్తమీద చూపినట్లు.
98. అత్తముండ కన్నా ఉత్తముండ మేలు.
99. అత్త ఱంకుబోతు, కోడలికి చెప్పినట్లు.
100. అత్తలేనమ్మ ఉత్తమురాలు, మామలేనమ్మ మరీభాగ్యశాలి.

Friday, May 16, 2008

vandanam

ఇక్కడ ఉన్న తెలుగు మిత్రులకి నా నమస్కారములు. నేను తెలుగు బ్లాగ్ కి కొత్త. తెలుగు లో బ్లాగ్స్ చూసాక నాకు చాల సంతోషం వేసింది. మీ అందరి సహకారంతో నేను కూడా ఏదో తోచిన నాలుగు మాటలు మీతో పంచుకుందామనే అనే ఆశ తో ఇక్కడికి వచ్చాను. ధన్యవాదములు.