Friday, October 29, 2010

సామెతలు-11

1. ఎండు పండు లేకుండా ఉంటుందా?
2. ఎండు మామిడి టెంకలు ఒళ్ళో పెట్టుకొని, ఎవరి త్రాడు తెంప వచ్చావోయి వీరన్నా అన్నదిట.
3. ఎంత ఉన్నవాడైనా ఒక్కసారి ఒకే ముద్ద మింగగలడు.
4. ఎంత ఉప్పుతింటే అంత దాహం.
5. ఎంత కఱవు ఐనా పులి పూరీ మేస్తుందా?
6. ఎంత చెట్టు కంత గాలి.
7. ఎంత చెట్టు కంత పాటు.
8. ఎంత చేసినా ఎడమచేతి కడియం కుద(దు)వే.
9. ఎంత దరిగిన మిరియాలు జొన్నలు సరిపోవే?
10. ఎంత తోండమున్నా దోమ ఏనుగు కాదు.
11. ఎంత దయో దాసులపై అన్నట్లు.
12. ఎంత నేరిచినా ఎంతజూచినా ఎంతవారలైన కాంత దాసులే.
13. ఎంత పండినా కూటికే, ఎంత ఉండినా కాటికే.
14. ఎంతపెద్ద చెట్టు ఎక్కినా ముడ్డి నేలనే చూస్తుంది.
15. ఎంత పెద్దవారికైనా ముడ్డి పీతికంపే.
16. ఎంత పెరిగినా గొఱ్ఱెకు బెత్తెడే తోక.
17. ఎంత పొద్దుండగా లేచినా తుమ్మగుంటవద్దనే తెల్లారుతుంది.
18. ఎంత పొద్దుకాడ లేచినా చింతగుంటపాలెం దగ్గరే తెల్లవారుతుంది.
19. ఎంత పోట్లాడుకున్నా కల్లుదుకాణం కాడ ఒక్కటే.
20. ఎంత ప్రాప్తో అంత ఫలం
21. ఎంతమంచి కత్తి అయినా తన పిడిని గంటు చేయదు.
22. ఎంత మంచి గొల్లకయినా వేపకాయంత వెఱ్ఱిలేకపోలేదు.
23. ఎంత మంచి పంది అయినా అమేధ్యం (అశుద్ధం) తినక మానదు.
24. ఎంతయ్యా ఇవ్వాళ బేరంలో లాభంమంటే, ఎఱిగినవాడు వెఱ్ఱివాడు రాలేదన్నాడుట.
25. ఎంతలావు మొగుడైనా ఆడదానికి లోకువే.
26. ఎంతవారలైనా కాంత దాసులే.
27. ఎంత వెలుగుకు అంత చీకటి.
28. ఎంత సంపదో అంత ఆపద.
29. ఎంత స్వామి ప్రసాదమైతే మాత్రం, ఇంత చేదా?
30. ఎందరో మహానుభావులు (వ్యంగ్యంగా కూడ ప్రయోగం).
31. ఎందరో మహానుభావులు, వారందరికి వందన మన్నారు.
32. ఎందుకు ఏడుస్తావురా పిల్లవాడా? అంటే, ఎల్లుండి మా అమ్మ కొడుతుంది అన్నాడుట.
33. ఎందుకు పుట్టావు ఏకా అంటే, ఎదుటివాళ్ళని వెక్కిరించటానికే అన్నదిట.
34. ఎందుకు పుట్టావు వక్రమా అంటే సక్రమమైన వాళ్ళను వెక్కిరించను అన్నదిట.
35. ఎందునైనా ముఖరాసి (జన్మరాశి) బాగుండాలన్నారు.
36. ఎందుకొచ్చినావే ఎల్లమ్మా అంటే, అందుకు కాదులే అగ్గికొచ్చాను అన్నదిట.
37. ఎందులో పుట్టిన పురుగు అందులోనే చస్తుంది (బ్రతుకుతుంది).
38. ఎందులో పెట్టినా ఎడారే.
39. ఎక్కగా ఎక్కగా పొడవు.
40. ఎక్కడ ఉన్నావే కంబళీ అంటే, వేసిన చోటనే గొంగళీ అన్నదిట.
41. ఎక్కడ కడితేనేమి, మన మందలో ఈనితే చాలు.
42. ఎక్కడకొట్టినా కుక్క కాలు కుంటుతుంది.
43. ఎక్కడైనా బావ అనుకానీ వంగతోటలో (కాడ) బావా అనకు.
44. ఎక్కడమేసినా పేడ మన పెరట్లో వేస్తే చాలు.
45. ఎక్కడ నుంచి వస్తున్నావోయ్ నత్తాయనా అంటే, రె రెడ్డొరించిను నుంచోయ్ చోయ్ న నంగాయనా అన్నాడట.
46. ఎక్కడమేసినా మనింట్లో పాలిస్తే చాలు.
47. ఎక్కడా దొరక్కపోతే అక్కమొగుడే గతి.
48. ఎక్కడాలేకపోతే అక్క మొగుడే దిక్కు.
49. ఎక్కడీకిపోతావు విధవమ్మా అంటే, వెంటవస్తాను పదవమ్మా అన్నదిట.
50. ఎక్కడికిపోయినా ఏలినాటి శని తప్పదు.
51. ఎక్కడీకిపోయినా కర్మం ఎదురుగుండానే వస్తుంది.
52. ఎక్కడిదక్కడె ఉంచి ఎల్లమ్మ ఇల్లలికి నట్లు.
53. ఎక్కడిదిరా ఈ పెత్తనం? అంటే, మూలనుంటే నెత్తిన వేసుకున్నా అన్నాడట.
54. ఎక్కడి నీరూ పల్లానికే చేరుతుంది (పారుతుంది).
55. ఎక్కమంటే ఎద్దుకు కోపం, దిగమంటే కుంటికి కోపం.
56. ఎక్కితే గిఱ్ఱపు రౌతు, దిగితే కాలిబంటు.
57. ఎక్కి కాయపట్టిచూసి, దిగివచ్చి రాళ్ళు రువ్వినట్లు.
58. ఎక్కిరించబోయి వెలకిత్తలా (వెల్లికింతలా) పడ్డట్లు.
59. ఎక్కువగా తిన్న పొట్ట, ఏకులు పెట్టిన బుట్టి చిరుగవు.
60. ఎక్కువ తెలివి ఏడ్పుల కారణం, తక్కువ తెలివి తన్నుల కారణం.
61. ఎక్కువయిన సొమ్ము బ్రహ్మలకిత్తునా? బట్లకిత్తునా?
62. ఎగతాళి అంటే ఏడువ వస్తాడు, కోడిగ మంటే కొట్టవస్తాడు.
63. ఎగతాళి చేసేవారిముందు జారిపడినట్లు.
64. ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య.
65. ఎగవేసే వాడి ఇల్లెక్కడా? అంటే ఊరికడపట అన్నట్లు.
66. ఎగిరిన దూది గాలిలో ఎంతోసేపు ఉండదు.
67. ఎగిరెగిరి దంచినా అంతేకూలి, ఎగరక దంచినా అంతేకూలి.
68. ఎగిరే ఎద్దే గంత మోసేది.
69. ఎగరబోయి బోర్లపడి, ఊరు అచ్చివచ్చిందికాదు అన్నాడట.
70. ఎగ్గును అనక, వినక, కనక కవి కావ్యం వ్రాయలేడు.
71. ఎచ్చులకు (డంబములకు) ఏటపోతును కోస్తే, ఒళ్ళంతా బొచ్చు అయ్యింది.
72. ఎచ్చులకు ఏలేశ్వరంపోతే పక్కతోలు కుక్కలెత్తుకు పోయినవి.
73. ఎచ్చులకు వేటపాలెంపోతే, తన్ని తలగుడ్ద తీసుకున్నారట..
74. ఎచ్చులకు ఏమారం పోతే, తన్ని తలగుడ్ద పెరుక్కున్నారుట.
75. ఎట్లా (ఎట్లాంటి)చిరుబోణికైనా వేపకాయంత వెఱ్ఱి ఉంటుంది.
76. ఎట్లా వచ్చిందో అట్లే పోతుంది, తేలికగా వచ్చింది తేలికగానే పోతుంది.
77. ఏడదిడ్డమంటే, పెడదిడ్డ మన్నట్లు.
78. ఎడపిల్ల ఏరాలితో సమానం.
79. ఎడమచేత్తో చేసింది కుడిచేత్తో అనుభవించవలె.
80. ఎడ్డెమంటే, తెడ్డెమన్నట్లు.
81. ఎతలున్నమ్మకు కతలు రావు.
82. ఎత్తివచ్చిన కాపురానికి ఏకాలూనినా ఒకటే.
83. ఎత్తుకున్న చంకనుండదు, దించిన దిగువనుండదు. (బిడ్డ)
84. ఎత్తుక తిన్నవాణ్ణి పొత్తులో పెట్టుకుంటే, అంతాతీసి బొంతలోపెట్టుకున్నాడుట.
85. ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్నా దిగదు.
86. ఎత్తుకొని తిన్న బోలె ఎదురుగా వస్తే, చంకనున్న బోలె సలాంచేసిందిట.
87. ఎత్తుబడిన గొడ్డు పులికి జడుస్తుందా?
88. ఎత్తుభారపు పెళ్ళికి ఏకాలుపెట్టినా ఒకతే. (ఎత్తుభారం=వ్యర్ధమైన, పనికి మాలిన).
89. ఎత్తుభారం మొత్తుకోళ్ళు.
90. ఎత్తుమరిగిన బిడ్డ, వెలుగుదాటే గొడ్డు ఏమిచేసినా వినవు.
91. ఎత్తువారి బిడ్డ. (ఎవరిచంకనున్న వారిమాట వినును).
92. ఎత్తెత్తి అడుగు వేస్తే పుల్లాకు మీద పడిందిట.
93. ఎత్తెత్తిపోసినా ఇత్తడి బంగారమగునే?
94. ఎత్తేవాడుంటే ఏకులబుట్టా బరువే.
95. ఎదలో కత్తెర నాలుకలో బెల్లం.
96. ఎదిగినదానిని వెంటేసుకు తిరిగినట్లు.
97. ఎదుట అన్నది మాటా, ఎదాన్న పెట్టినది వాత.
98. ఎదుట ఉన్నవాడు పెండ్లికొడుకు.
99. ఎదుట బ్రాహ్మడు లేకపోతే వెయ్యి యఙ్ఞాలు చెయ్యవచ్చు.
100. ఎదుట లేకుంటే ఎదలో ఉండదు.

Wednesday, October 27, 2010

సామెతలు-10

1. ఊరకున్నవాడే ఉత్తమయోగి
2. ఊరకున్నవాడీని ఊరేమీ చెయ్యలేదు.
3. ఊరకున్నవాడికి ఊహలు రావు.
4. ఊరకున్నవాడికి ఉల్లిమిరియం పెట్టినట్లు.
5. ఊరపందికి పన్నీరు, చెవిటికి వీణ వంటిది.
6. ఊరపిచ్చుకకు గుమ్మడికాయంత గూద.
7. ఊరపిచ్చుకకు తాటికాయంత గూద
8. ఊరపిచ్చుకమీద తాటికాయ పడినట్లు.
9. ఊరపిచ్చుకమీద వాడి చంద్రాయుధమా?
10. ఊరంతా ఊరించి ఊగాదినాడు బూరె ఇచ్చెనట.
11. ఊరికంతా ఒక బోగముదైతే ఆ బోగముది ఎవరివద్ద ఆడును?
12. ఊరికళ గోడలే తెలుపుతాయి.
13. ఊరికి అమాసే లేదు అన్నట్లు.
14. ఊరికి ఉపకారంగా ఆలికి ఒక కోక కొనిపెడతాను, ఇంటింటికొక డబ్బివ్వండి అన్నట్లు.
15. ఊరికి వచ్చినమ్మ నీరుకు రాదా?
16. ఊరకుక్కా, సింహం ఒకటి అగునా?
17. ఊరకే ఉండక ఉల్లంకలు (తగాదాలు) పెట్టి చెప్పుదెబ్బలు సేవకులకి ఇప్పించారట.
18. ఊరకే పెట్టె అమ్మను నీ మొగుడితో పాటు పెట్టమన్నట్లు.
19. ఊరకే వస్తే మావాడు ఇంకోడున్నాడు అన్నట్లు.
20. ఊరికొకవానా, ఊదరకింకొకవానా కురుస్తుందా?
21. ఊరిజబ్బు చాకలి ఎరుగును, ఉద్యోగి జబ్బు బంట్రోతు ఎరుగును.
22. ఊరిదగ్గఱి చేనుకు అందరూ దొంగలే.
23. ఊరిన పుండు మీద ఉప్పుకారం చల్లినట్లు.
24. ఊరినిండా అప్పులు, తలనిండా బొప్పెలు.
25. ఊరినిండా అప్పులు, నోటి నిండా పళ్ళు.
26. ఊరి పిడూగు పోలిసెట్టి బుడ్డమీడ పడిందిట.
27. ఊరి ముందరికి వచ్చి నా పెళ్ళాం పిల్లా ఎట్లున్నారని అడిగినాడట.
28. ఊరి ముందరి చేను, ఊళ్ళో వియ్యం కొరగావు.
29. ఊరి ముందరి చేను ఊరపిచ్చుక పాలు.
30. ఊరిముందరి సేద్యం, మద్దెకాడి బద్దెల పలుపు ఉంటే, ఆరేండ్లు సేద్యంచేస్తా అన్నదిట ఎద్దు.
31. ఊరిముందు ఉరుకులాట, మగని ముందు గంతులాట.
32. ఊరిలో కుంటి, అడవిలో లేడి.
33. ఊరివరకూ వచ్చి ఊరిగమిని ముందు పరుగెత్తినట్లు.
34. ఊరివారి పసుపు, ఊరివారి కుంకుమ, ఎవరిదేమిపోయే.
35. ఊరివారి బిడ్డను నగరివారు కొడితే, నగరివారి బిడ్డను నారాయణుడు కొడతాడు.
36. ఊరివారి బిడ్దను రాజుగారు కొడితే, రాజు గారిబిడ్డను దేవుడు కొట్టును.
37. ఊరివారి వడ్ల పుణ్యాన్ని, మా అత్త ముడ్డిపుణ్యాన్ని, నాకు నేడు భోజనం దొరికింది.
38. ఊరిశని వచ్చి వీరిసెట్టిని కొట్టినదట.
39. ఊరుంటే మాదిగ గేరి (వాడ) ఉండదా?
40. ఊరుంటే మాలపల్లి (మాలాడ) ఉండదా?
41. ఊరు ఉసిరికాయంత, తగవు తాటికాయంత.
42. ఊరు ఉస్తికాయంత, సిద్ధాంతం తాటికాయంత.
43. ఊరుకాలిన మంటకు కూడుడుకునా?
44. ఊరుకోమని ఉరెట్టుకున్నదిట.
45. ఊరు తిరిగిరమ్మంటే రోలు తిరిగివచ్చినట్లు.
46. ఊరు దూరము, కాడు దగ్గిర.
47. ఊరున్నది, చిప్ప ఉన్నది, నాకేంతక్కువ అన్నట్లు.
48. ఊరుపండితే ఊకైనా దొరుకుతుంది.
49. ఊరు పుట్టినప్పుడే, ఉగాది పుట్టింది.
50. ఊరు పుట్టినప్పటినుండి ఎన్ని ఉగాదులు రాలేదూ, ఎన్ని ఉగాదులు పోలేదూ?
51. ఊరు పొమ్మంటున్నది, కాడు రమ్మంటున్నది.
52. ఊరుమాసినా పేరు మాయదు.
53. ఊరులేక పొలిమేర ఉండునా?
54. ఊరువిడిచి పొరుగూరుపోయినా పూనిన కర్మపోదు.
55. ఊరేలినా తా పండుటకు మూడు మూరల తావే.
56. ఊళ్ళు చేసిన బాకీ కూళ్ళుచేస్తే తీరుతుందా?
57. ఊళ్ళేలని వారు రాజ్యాలేలుతారా?
58. ఊళ్ళేలే కొడుకు కన్నా ఊపాదానమెత్తే పెనిమిటి మేలు.
59. ఊళ్ళో అధికారమైనా ఉండాల, ఊరంచు పొలమైనా ఉండాల.
60. ఊళ్ళో ఇల్లులేదు, పొలంలో చేను లేదు.
61. ఊళ్ళో పెండ్లయితే ఱంకుముండలకు రాగిసంకటి దిగదు.
62. ఊళ్ళోకి రాజుగారు వస్తున్నారంటే, పెండ్లమువంక అనుమానంగా చూసినట్లు.
63. ఊళ్ళోకి రవొద్దు రౌతా అంటె గుఱ్ఱాన్ని ఎక్కడ కట్టేసేది అన్నాడట.
64. ఊళ్ళో (పెళ్ళికి)పెళ్ళైతే కుక్కలకు హడావుడి.
65. ఊళ్ళో ముద్ద గుళ్ళో నిద్ర.
66. ఊళ్ళోవాళ్ళ ఉసురోసుకొని, నూరేండ్లు బ్రతకమన్నట్లు.
67. ఊళ్ళోవాళ్ళకి పనిచేసి ఒళ్ళంతా దుమ్ము చేసుకొన్నట్లు.
68. ఊసరవిల్లి వలే రంగులు మార్చేవాడు.
69. ఊసరక్షేత్రంలో అలికితే ఉల్లికోపుల పంట.
70. ఊసరక్షేత్రంలో దూసరి తీగ.
71. ఊసరక్షేత్రంలో పైరు, ణిరులేని చెరువుకింద సేద్యము.
72. ఊహ ఊళ్ళేల మంటే, వ్రాత (రాత) రాళ్ళుమోయమన్నది.
73. ఊహలు ఊళ్ళేలుతుంటె, ఖర్మం కట్టెలు మోయిస్తున్నది.




74. ఋణము, రణము ఒకటే.
75. ఋణశేషం, వ్రణశేషం, శత్రుశేషం ఉంచరాదు.
76. ఋషిమూలం, నదిమూలం, స్త్రీమూలం విచారించరాదు.




77. ఎంగిలాకులు ఎత్తమంటే, వచ్చినవాళ్ళను లెక్కపెట్టినాడట.
78. ఎంగిలికి ఎగ్గులేదు, తాగుబోతుకు సిగ్గులేదు.
79. ఎంగిలిచేత (తితో) కాకిని తోలనివాడు (అదల్చనివాడు) భిక్షంపెట్టునా?
80. ఎంగిలితిండికి ఆపోశనం ఎత్తవలెనా?
81. ఎంగిలిబూరెను కడిగినట్లు.
82. ఎంచకురా పంచుకుంటావు.
83. ఎంచబోతే మంచమంతా కంతలే.
84. ఎంచిన ఎరువేదిరా అంటే, యజమాని పాదమే.
85. ఎంచివేస్తే ఆరి తరుగుతుందా?
86. ఎండ్రకాయ కొవ్వితే కలుగులో నిలువదు.
87. ఎండ్రకాయ కొవ్వినా, యానాది కొవ్వినా కలుగులో ఉందరు.
88. ఏండకాచిన నాడు ఏకులు వడికి, వానకురిసిన నాడు పత్తి పట్టుకున్నట్లు.
89. ఎండకు పెట్టీన టోపీ, వడగండ్లకాగునా?
90. ఎండకాసిన చోటే, వెన్నెల కూడా కాసేది.
91. ఎండబడితే ఉండబడుతుంది, ఉండబడితే వండబడుతుంది, వండబడితే తిండిపడుతుంది, తిండిపడితే కండపడుతుంది.
92. ఎండమావుల్లో నీరు ఎందుకెక్కినట్లు?
93. ఎండ మిడిసికాసినా చీకట్లకి గుహలుండనే ఉండును.
94. ఎండాకాలంలో ఏకులువడికి వానాకాలంలో వడ్లుదంచినట్లు.
95. ఎండావానా కలిస్తే కుక్కలకు నక్కలకు పెండ్లి.
96. ఎండావానా వస్తే నక్కలపెళ్ళి.
97. ఎండితే తరుగుతుందని పచ్చిదే తినేవాడు.
98. ఎండిన ఉళ్ళగోడు ఎవడికి కావాలి? పండిన ఊళ్ళకు అందరూ ప్రభువులే.
99. ఎండినమోడుకు ఎఱ్ఱనిపూలు తగిలిచినట్లు.
100. ఎండునేలమీద ఎండ్రకాయ కనపడితే వాన తప్పదు.

Monday, October 25, 2010

సామెతలు-9

1. ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టే, లేనమ్మా ఉన్నమ్మకే పెట్టె.
2. ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టును, లేనివాడూ ఉన్నవానికే పెట్తును.
3. ఉన్నవాడు ఊరికి పెద్ద, చచ్చినవాడు కాటికి పెద్ద.
4. ఉన్నవాడు ఖర్చు పెట్తకపోతే అంటారు, లేనివాడు ఖర్చు పెడితే అంటారు.
5. ఉన్న శాంతం ఊడ్చుకుపోయింది గానీ కోపమే లేదు.
6. ఉపకారం అంటే ఊళ్ళోంచి లేచిపోయినట్లు.
7. ఉపకారానికి పోతే అపకారం వెంటవచ్చినట్లు.
8. ఉపకారపు మొగుడు వుంటే, మనువిచ్చాడుట.
9. ఉపనయనము నాటిమాట ఉన్నది సుమతి. (భవతీ భిక్షాందేహి అనుట).
10. ఉపాయం లేని వాడు, ఉపవాసంతో చచ్చాడు.
11. ఉపాయం లేని వాణ్ణి ఊళ్ళోనుంచి వెళ్ళకొట్టమన్నారు.
12. ఉపాయం చెప్పవయ్యా అంటే, ఉరిత్రాడు తెచ్చుకోమన్నాడట.
13. ఉపాయం ఉన్నవాడు ఊరిమీద (పడి) బ్రతుకుతాడు.
14. ఉపాయం ఎరుగని దాసరయ్యా, ఊళ్ళ ఉపాసం ఉండవయ్య.
15. ఉపాయవంతుడు ఊరికి ఉరవడి.
16. ఉప్పరసన్యాసం ఉభయ భ్రష్టత్వం.
17. ఉప్పు ఊరగాయ కాదు.
18. ఉప్పుకు నిప్పువలే.
19. ఉప్పుతిని ఉపతాపమందనేల?
20. ఉప్పుతిన్న కోడే ఊరిపోయింది, పప్పు తిన్న కోడే పాలిపోయింది.
21. ఉప్పు తిన్న ప్రాణం ఊరుకోదు.
22. ఉప్పుతిన్న వాడు నీరు తాగక తప్పదు.
23. ఉప్పుతో తొమ్మిది పప్పుతో పది.
24. ఉప్పు పులుసు కారము తినే శరీరానికి ఊపిరి ఉన్నంతవరకే ఉంటుంది కామము.
25. ఉప్పు మిరపకాయ ఊరికే రాగా ఆలినికొట్ట చేతులు తీటా?
26. ఉప్పు ముల్లెను నీటిలో ముంచినట్లు.
27. ఉప్పులేదు కారంలేదు, అమ్మతోడు! కమ్మగుంది.
28. ఉప్పులేని పప్పు, ఊరగాయలేని సద్ది.
29. ఉప్పువాడు ఏడిసాడు, పప్పువాడూ ఏడిసాడు, బోండాపు కాయలవాడు పొర్లి పొర్లి ఏడిసాడు.(ఎవరిసొమ్ము వారికి ఎక్కువ అనుట).
30. ఉప్పువాడూ చెడె, పప్పువాడు చెడె, తామలపాకులవాడు తమాము చెడె.
31. ఉప్పువేసి పొత్తు కలిపినట్లు.
32. ఉప్పోడు పప్పోడు ఊరుకుంటే, టెంకాయల వాడు పొర్లి పొర్లి ఏడ్చాడుట.
33. ఉబుసుపోకకు పిండిబొమ్మనుచేసి పీట మీద కూర్చోపెడితే, ఆడబిడ్డతనాన అదిరి అదిరి పడిందట.
34. ఉబ్బుమొగంవాడు ఊరువెలదామంటే, రెప్పలేనివాడు రేపువెల్దామన్నాడుట.
35. ఉభయపవిత్రాలు తిని, ఉద్దెరిణ నీళ్లు తాగి 'ఊహూ' అంటావా ఉత్తమాశ్వమా?
36. ఉభయబ్రష్టత్వం, ఉపరి(ఉప్పరి) సన్యాసం.
37. ఉమ్మడికి (పనికి) బడుగు, సొంతానికి పిడుగు
38. ఉమ్మడిగా తిని ఒంటరిగా బలవాలి.
39. ఉమ్మడిగొఱ్ఱె పుచ్చి చస్తుంది.
40. ఉమ్మడిబేరం, ఉమ్మడిసేద్యం ఇద్దరికీ చేటు.
41. ఉయ్యాలలో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు.
42. ఉరికిఉరికి పసూలు కాస్తే ఎన్నాళ్లు కాస్తావు?
43. ఉరికిఉరికి ఊరిపిడుగు పోలిసెట్టి బుడ్డమీద పడ్డట్టు.
44. ఉరిమిన మబ్బు కురవక మానదు.
45. ఉరిమిన మబ్బు తరిమిన పాము ఊరకే పోవు.
46. ఊరిసినచోట (కాలినచోట) ఉడుకులు చల్లినట్లు.
47. ఉరిసిన పుండుపై ఉప్పుచల్లినట్లు.
48. ఉరుకు ఉరుకు అనే సవతేగానీ, తోడు ఉరికే నా సవతే లేదు.
49. ఉరుకు తొత్తుకు విటుడుండనేల?
50. ఉర్సులకుపోతే కర్సులకు కావాలి.
51. ఉలవకాని పొలం ఊసర క్షేత్రం.
52. ఉలవలచేను పెట్టిన మగడురకుండక పత్తిచేనుపెట్టి ప్రాణం మీదికి తెచ్చినాడు.
53. ఉలవలు తింటావా బసవన్నా? అంటే 'ఊ ' అన్నట్లు (తలాడించినట్లు).
54. ఉలవలుతిన్నమ్మకు ఉలుకు, సజ్జలు తిన్నమ్మకు సలుకు.
55. ఉలవలెత్తమంటే ఊళ్ళడిగినట్లు.
56. ఉలిపికట్టెకేలరా ఊళ్ళో పెత్తనాలు? (ఉలిపికట్టె=పనిలేనివాడు).
57. ఉలుకున్నమ్మకు అలుకెక్కువ, గూద ఉన్నమ్మకు బాధ ఎక్కువ.
58. ఉల్లాసంబట్టి ఊరికరణాన్ని (కరణంతో) పోతే, దొమ్మరిపట్టి తొంబై యియ్యమన్నదిట.
59. ఉల్లి ఉంటే మల్లికూడా వంటలక్కే.
60. ఉల్లి ఊరినా మల్లి పూసినా మంచి నేలలోనే.
61. ఉల్లిగడ్డంత కోడలువస్తే వల్లికలోఉన్న అత్త ఉలికి ఉలికి పడిందట. (వల్లిక=స్మశానం).
62. ఉల్లి చేసినమేలి తల్లి ఐనా చెయ్యదు.
63. ఉల్లితిన్న కోమటి ఊరుకొన్నట్టు. (నోరు తెరిస్తే కంపని).
64. ఉల్లిని నమ్మి తల్లిని నమ్మి చెడినవాడులేడు.
65. ఉల్లి పదితల్లుల పెట్టు.
66. ఉల్లి పువ్వు ఉల్లిపువ్వే, మల్లెపువ్వు మల్లెపువ్వే.
67. ఉల్లి మల్లి అవుతుందా? ఉంచుకున్నది పెళ్ళాం అవుతుందా?
68. ఉల్లి మల్లికాదు, కాకి కోకిల కాదు.
69. ఉల్లి ముట్టనిదే వాసన రాదు.
70. ఉసురు (ఊపిరి) ఉంటే, ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతుకవచ్చు.




71. 'ఊ' అంటే తప్పు 'ఆ " అంటే తప్పు; నారాయణా అంటే బూతు (మాట).
72. ఊక ఊకే నూక నూకే!
73. ఊగిఊగి ఉయ్యాల ఉన్నచోటికే వస్తుంది.
74. ఊట వేసిన మడి, వాత వేసిన పశువు (కొరగావు).
75. ఊదరకూ డెన్నాళ్ళు, ఉద్యోగం ఎన్నాళ్ళు.
76. ఊదర ఒక ధాన్యమా? ఉండ్రాళ్ళొక పిండివంటా? (ఊదర=వరిచేలలోని ఒక కలుపు మొక్క).
77. ఊదువేయనిదే పీరు లేవదు. (ఊదు= సంబ్రాణి ధూపం).
78. ఊపిరి పట్టితే బొజ్జ నిండునా?
79. ఊబ నామొప్గుడు, ఊళ్ళో ఉన్నా ఒకటే, దండులో ఉన్నా ఒకతే. (ఊబ=నపుంసకుడు).
80. ఊబనామొగుడు ఉండీ ఒకటే లేకా ఒకటే.
81. ఊరంతా ఉత్తరం చూస్తే, దాసరిపుల్లయ్య దక్షిణం చూసాడట.
82. ఊరంతా ఉల్లి: నీవెందుకే తల్లి.
83. ఊరంత ఉల్లిపూస్తే మాలపల్లి మల్లె పూసె.
84. ఊరంతా ఊరిముఖం, దాసరి తాళ్ళముఖం (తాళ్ళు=తాటిచెట్ల తోపు).
85. ఊరంతా ఒకటైతే చేనంతా ఒకమేర.
86. ఊరంతా ఒక త్రోవ, ఉలిపికట్టెది ఇంకొక త్రోవ.
87. ఊరంతా ఒక త్రోవ, ఊదుదోకది ఇంకొకదోవ. (ఉడుదోక=విడిచిన ఆడది; అప్రయోజకురాలు).
88. ఊరంతా చుట్టాలు, ఉట్టి కట్టుకోను చోటులేదు.
89. ఊరంతా చుట్టాలు, ఉచ్చపోసుకోను చోటులేదు.
90. ఊరంతా మేనమామలు ఉచ్చపోసుకోను చోటులేదు.
91. ఊరంతా నాన్నకు లోకువ, నాన్న అమ్మకు లోకువ.
92. ఊరంతా వడ్లెండబెట్టుకుంటే, నక్క తోక ఎందబెట్టుకున్నదట.
93. ఊరక 'మామా' అనక, 'పెళ్ళాం తండ్రీ' అన్నట్లు.
94. ఊరకరారు మహానుభావులు (మహాత్ములు).
95. ఊరకుండటం కంటే ఊగులాడటం మేలు.
96. ఊరకుండలేక ఉప్పరిని తగులుకుంటే, తట్టకొక తన్ను తగిలిస్తున్నాడు.
97. ఊరకుండలేక ఒళ్ళు ఉమ్మెత్తాకుతో (దురదగొండెతో) రుద్దుకొన్నట్టు.
98. ఊరకున్న దేవుడికి ఉపారాధన లెట్లు వస్తాయి?
99. ఊరకున్న ప్రాణానికి ఉచ్చుతాళ్ళు తెచ్చుకున్నట్లు.
100. ఊరకున్న ప్రాణానికి ఉరిపోసుకున్నట్లు.

Thursday, October 21, 2010

సామెతలు-8

1. ఈ నెలలో వడ్డీలేదు, వచ్చేనెలలో అసలూ లేదు.
2. ఈపిలేని చోట పేలు వెతికినట్లు.
3. ఈ పొడుము పీల్చనీవే, నీ పాడె బిగిస్తా అన్నాడుట.
4. ఈ ముడ్డి ఇట్లాంటి ఏర్లను ఎన్ని చూడలేదంటే, ఈ ఏరు ఇట్లాంటి ముడ్లను ఎన్నిటిని చూడలేదు అన్నట్లు. (కప్ప ఎగిరితే నీటిమీద అలిగి ముడ్డి కడుక్కోకుండ వచ్చిన వాడు అని, అనిపించుకొన్న మాట.)
5. ఈ మొహానికా సేరు పసుపు?
6. ఈ మొద్దు మొహానికా ఆ గరుడసేవ.
7. ఈరక్క పెండ్లిలో పేరక్క గర్భదానం.
8. ఈవల గట్టున ఉండే ఆవుకు ఆవలిగట్టు పచ్చన.
9. ఈలోకంలో ధర్మంఉంటే పరలోకంలో బంధువవుతుంది.
10. ఈవేళ చస్తే రేపటికి రెండు.
11. ఈ సంబడా(ళా)నికేనా ఇంత సంబరం? (సంబడం=సంబరం, వేడుక; సంబళం=జీతం).


12. ఉంగరం చెడిపి బొంగరం, బొంగరం చెడిపి ఉంగరం చేసినట్లు.
13. ఉంగరాలచేతితో మొట్టేవాడు చెబితేనే వింటారు.
14. ఉంచుకున్నవాడు మొగుడు కాదు, పెంచుకున్న వాడు కొడుకుకాడు.
15. ఉంటే అమీరు లేదా పకీరు.
16. ఉంటే ఉగాది లేదా శివరాత్రి.
17. ఉంటే ఊరు, లేదా పాడు.
18. ఉంటే అమీరుసాహేబు, లేకుంటే పకీరుసాహెబు, చస్తే పీరుసాహెబు.
19. ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేదు.
20. ఉండనిస్తే పండుతుంది, ఊడదీస్తే ఎండుతుంది.
21. ఉండమనలేక ఊదర, పొమ్మనలేక పొగ పెట్టినట్లు.
22. ఉండి ఉండి ఉప్పరవానిని(తో) పోతే, చచ్చేదాకా తట్టలమోతే.
23. ఉండి ఉండి ఉప్పరవానిని కట్టుకుంటే, తట్ట తట్టకూ తలపోతలే.
24. ఉండిచూడు ఊరు అందము, నానాటికిచూడు నా అందము.
25. ఉండే ఒకబిడ్డా బసివి ఐనట్లు.
26. ఉండే ఖర్మ చాలక ఉపకర్మ ఇంకొకదానిని తెచ్చుకొన్నట్లు.
27. ఉండేందుకు స్థలం ఇస్తే పడుకోవటానికి మంచం అడిగినట్లు.
28. ఉండేది ఒక్క పిల్ల, ఊరంతా మేనరికం.
29. ఉండేది గడ్డి, పోయేది పొట్టు.
30. ఉన్నవాడు ఉలవ, పోయేవాడు నువ్వు.
31. ఉండ్రాళ్ళు ఒక పిండి వంటేనా? మేనత్త కొడుకు ఒక మొగుడేనా?
32. ఉండృఆళ్ళు పిండివంటా కాదు, ఊదర ధాన్యమూ కాదు.
33. ఉండ్రాళ్ళ మీద భక్తా? విఘ్నేశ్వరుడి మీద భక్తా?
34. ఉగ్గుతో చేర్చిన గుణం నుగ్గులతోగానీ పోదు.
35. ఉచితానికి ఊళ్ళు, లెక్కలకి కాసులు.
36. ఉ(చ్చ)కుండ ఉట్టికెత్తి నేతికుండ నేలను బెట్టినట్లు.
37. ఉచ్చగుంటలో చేపలు పట్టినట్లు.
38. ఉచ్చపోసి గొరిగించారు అంటే ఎన్ని ముంతలు అన్నట్టు.
39. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కునా?
40. ఉట్టికి ఎగరలేని వాడు స్వర్గానికి ఎగురుతా అన్నట్లు.
41. ఉట్టికి చట్టికి రెంతికి చెడ్డట్టు.
42. ఉట్టిమీద కూడు, ఊరిమీద నిద్ర.
43. ఉట్టిమీద వెన్న పెట్టుకొని ఊరంతా నెయ్యికి దేవులాడినట్లు.
44. ఉడకేసుకొని తిని తడకేసుకొని పడుకున్నట్లు.
45. ఉడికిన మెతుకులు తిని ఊళ్ళో ఉండేవాణ్ణి, నాకు ఎవరితో ఏమి పని ఉంది?
46. ఉడికినా తంతా ఉడకకపోయినా తంతా అన్నట్లు.
47. ఉడుత ఊపులకు కాయలు రాలునా?
48. ఉడుత ఊపులకు మాకులు ఊగునా?
49. ఉడుత ఊపులకు ఏపులు ఊగునా?
50. ఉడుము కొవ్వి పోలేరమ్మను పట్టుకొన్నదట.
51. ఉడుముని చంకలో పెట్టుకొని ఊళ్ళో ప్రవేశించినట్లు.
52. ఉడుముపోతే పోయింది నా చెయ్యి వస్తే చాలు.
53. ఉడుములలో తల, పాములలో తోక.
54. ఉతికే వానికే గానీ చాకలి ఉతకడు.
55. ఉత్తకుండకు ఊపులెక్కువ.
56. ఉత్తదొడ్డుకు అరపులు మెండు.
57. ఉత్తచెవికన్నా చెవ్వాకు (ఒక ఆభరణం) చెవి మేలు.
58. ఉత్త చేతులతో మూర వేసినట్టు.
59. ఉత్త పుణ్యానికి మొత్తుక సచ్చిందంట.
60. ఉత్తమమైన ఇల్లాలు ఊరేగి వెళ్ళితే, ఉత్తరేణి కాలి ఊళ్ళన్ని కాలిపోయినవట.
61. ఉత్తముండ కన్నా అత్తముండమేలు.
62. ఉత్తముండ వచ్చి అత్తముండని 'ధూత్ ' అన్నదిట.
63. ఉత్తముల మహిమ నీరుకొలది తామర(వంటిది).
64. ఉత్తర ఉరిమినా, త్రాచు తరిమినా కురవక-కరవక మానవు.
65. ఉత్తర ఉరిమినా, రాజు పాడితప్పినా, చెదల పురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.
66. ఉత్తరచూచి ఎత్తర గంప, విశాఖ చూసి విడవర కొంప.
67. ఉత్తర పదను, ఉలవకు అదను.
68. ఉత్తరపు వాకిలి ఇల్లు ఊరకే ఇచ్చినా వద్దు.
69. ఉత్తరలో ఊడ్చేకంటే, గట్లమీద కూచోని ఏడ్చేది మేలు.
70. ఉత్తరలో చల్లిన పైరు, కత్తెరలో నరికిన కొయ్య.
71. ఉత్తరాన మబ్బు ఏలితే ఊరకే పోదు.
72. ఉత్తరాయణం వచ్చింది ఉరిపెట్టుకో అన్నట్లు.
73. ఉద్దత్తులమధ్య పేదలకుంద తరమే?
74. ఉద్దర(అప్పు, ఊరికే వస్తే ) అయితే ఊళ్ళుకొంటరు. నగదు ఐతే నశ్యం కూడా కొనరు.
75. ఉద్దర ఐతే నాకిద్దరు అన్నాడుట.
76. ఉద్దర సొమ్ము దుడ్డుకు పంచేరు.
77. ఉద్దరసొమ్ము నిద్దుర చేటు.
78. ఉద్ధరిణెడు నీళు ఉంగరపు వేలు దర్భ.
79. ఉద్యోగం గట్టిపడుతుంది, ఉన్న పుస్తె తేవే!
80. ఉద్యోగం పురుష లక్షణం, అదిపోతే అవలక్షణం.
81. ఉద్యోగం పురుష లక్షణం, గొడ్డలితేరా నిట్రాడు తెగనరుకుదాం.
82. ఉద్యోగికి ఒక ఊరులేదు, ముష్టివానికి ఒక ఇల్లు లేదు.
83. ఉద్యోగికి దూరభూమిలేదు.
84. ఉన్న అమ్మ గాదె (పాతర) తీసేప్పటికి లేని అమ్మ ప్రాణం లేచిపోయింది.
85. ఉన్న ఊరిలో ముష్టి అయినా పుట్టదు.
86. ఉన్న ఊరువాడికి వెలుతురు భయం, పొరుగూరివాడికి నీడ(ళ్ల) భయం.
87. ఉన్న ఊరు కన్నతల్లి వంటిది.
88. ఉన్నది అంతా ఉండగా, ఊపాధ్యాయులవారి భార్య సమర్తాడిందిట.
89. ఉన్నది ఉండగా, ఉయ్యూరిమీద మేడూరు వచ్చిపడ్డట్టు.
90. ఉన్నది ఉలవకట్టె, పోయింది పొలికట్టె.
91. ఉన్నది ఒక్క కూతురు, ఊరంతా అల్లుళ్ళు.
92. ఉన్నది ఒక్క బిడ్డ, ఊరంతా మొగుళ్ళు.
93. ఉన్న ఒక్కమెతుకు కాస్తా గంజిలో పోయినట్లు.
94. ఉన్నదున్నట్లు చెప్పమంటె, తిన్నదేమి చేసేనూ- అన్నదట లంజ.
95. ఉన్నదిపోదు లేనిది రాదు.
96. ఉన్నదిపోయే ఉంచుకున్నదీ పోయె.
97. ఉన్ననాడు ఉగాది పండుగ, లేని నాడు కాముని పండుగ.
98. ఉన్నమాట అంటే, ఉండే ఊరు అచ్చిరాదు.
99. ఉన్న మాట అంటే ఉలుకెక్కువ.
100. ఉన్న మాట అంటే ఊరికే చేటు.

Wednesday, October 20, 2010

సామెతలు-7

1. ఇరుగు ఇంగలం, పొరుగు మంగలం.
2. ఇరుగు గుడ్డి, పొరుగు గుడ్డి, ఇంటి ఇల్లాలు గుడ్డి.
3. ఇరుగును చూసి పొరుగు వాతపెట్టుకున్నట్లు.
4. ఇరుగూరి వ్యవసాయం, ఇద్దరు భార్యల సంసారం ఒక్కటే.
5. ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరుడి బండీఐనా పారదు. (లంచం లేక పని కాదు అనుట).
6. ఇఱుకులో సరుకు దించినట్లు.
7. ఇఱుకులో సరుకు మంత్రం.
8. ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు, కొమ్ములబఱ్ఱె కొట్టానికి చేటు.
9. ఇల్లా నారాయణమ్మా అంటె, వెళ్ళు గోవిందా అన్నట్టు.
10. ఇల్లరికం కన్నా మూలరికం (మాలరికం) మేలు.
11. ఇల్లలుకగానే పండుగౌతుందా?
12. ఇల్లాలా ఇల్లాలా మగలెందరే అంటే, తోలాటకాయతో తొంభైమంది అన్నదిట.
13. ఇల్లాలి గుడ్డ మల్లిని చీకే, లంజ గుడ్డ బండను చీకే.
14. ఇల్లాలు గుడ్డిదైతే ఇంటి కుండలకు చేటు.
15. ఇల్లాలు లేని ఇల్లు భూతాలకు నెలవు.
16. ఇల్లాలి శుచి ఇల్లు చూడగానే తెలుస్తుంది.
17. ఇల్లిటపుటల్లుడు ఇల్లెల్లపాదికి మొగుడు.
18. ఇల్లు ఇచ్చినవానికి, మజ్జిగ పోసిన వానికి మంచి లేదు.
19. ఇల్లు ఇరకటం, ఆలు మరకటం.
20. ఇల్లు ఈగల పాలు దొడ్డి దోమల పాలు.
21. ఇల్లు ఈగలపెంట, దొడ్డి దోమలపెంట.
22. ఇల్లు ఈడుమాను, పందిరి పట్టిమంచం.
23. ఇల్లు ఉండగా ఇడుపున (గోడపక్క) పెట్టుక తినవలెనా?
24. ఇల్లు ఎక్కి, కొరవి తిప్పినట్లు.
25. ఇల్లు ఎక్కి, కోక విప్పినట్లు.
26. ఇల్లు ఎక్కి గంతులేస్తూ, చూసేవాని మీద తుపాకి పేలుస్తా అన్నదిట.
27. ఇల్లు కట్టగానే ఎలుకల రావిడి.
28. ఇల్లు కట్టిచూడు, పెళ్ళి చేసిచూడు.
29. ఇల్లు కాలబెట్టి జల్లెడతో నీళ్ళు పోసినట్టు.
30. ఇల్లు కాలింది జంగమయ్యా ! అంటే, నాజోలె, కప్పెర నాదగ్గరే ఉన్నాయిలే అన్నాడుట.
31. ఇల్లు కాలి ఒకడేడ్చే, ఒళ్ళుకాలి ఒకడేడ్చే.
32. ఇల్లు కాలి ఒకడేడిస్తే, ఇంగిలీకాలకు ఇంకోకడేడ్చాడుట.
33. ఇల్లు కాలిపోతుంది ఈర్రాజూ అంటె నాదేమిపోతుంది నరసరాజూ అన్నాట్ట.
34. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటె, చుట్టకు నిప్పివ్వమన్నట్టు.
35. ఇల్లు కాలుతుంటే బావి తవ్వించినట్లు.
36. ఇల్లు కాలుతుండగా వాసాలు దూసుకున్నట్లు.
37. ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు.
38. ఇల్లు చూసి పిల్లి సమర్తాడిందిట.
39. ఇల్లు దాటిన ఆడది లోకానికి లోకువ.
40. ఇల్లు తిరిగిరమ్మంటే, ఇలారం తిరిగి వచ్చినట్లు.
41. ఇల్లు పీకి పందిరి వేసినట్లు.
42. ఇల్లు లేనమ్మ హీనము చూడు, మగడులేనమ్మ మానము చూడు.
43. ఇల్లు విడిచినతరువాత ఇల్లాలవుతుందా?
44. ఇల్లు విడ్చిన ఆదది, చెట్టు విడ్చిన కోతి.
45. ఇల్లు విడిచిపోరా నంబి అంటె, నా మాన్యమెక్కడ అన్నాడుట.
46. ఇల్లు వెళ్ళగొట్తగా ఇడుపుల శృంగారం, మొగుడు వెళ్ళగొట్టగా మొత్తం (మొత్తల) శృంగారం.
47. ఇల్లెక్కి కొరవి తిప్పినట్లు.
48. ఇల్లే తీర్ధం, వాకిలే వారణాసి, కడుపే కైలాసం.
49. ఇల్లేరు ఇంకితేనేమీ? కొల్లేరు పొంగితేనేమి?
50. ఇవ్వాళ అందలం ఎక్కడమెందుకు, రేపు జోలి పట్టడమెందుకు?
51. ఇవ్వాళ గుఱ్ఱం ఎక్కడమెందుకు, రేపు గాడిద నెక్కడం ఎందుకు?
52. ఇష్టం లేని పెళ్ళాన్ని 'ఒసే' అన్నా తప్పే, 'అమ్మా' అన్నా తప్పే.
53. ఇష్టంలేని మొగుణ్ణి చూసి కొనవేళ్ళతో మొత్తుకున్నట్లు.
54. ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం.
55. ఇష్టమైన వారి పెంట ఇంగువతో సమానం.
56. ఇసుకతో తాడు పేమినట్లు.
57. ఇసుక బావి తవ్వ ఎవరి వశం?
58. ఇస్తినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మ వాయనమన్నట్లు.
59. ఇస్తే చెడేదిలేదు, చస్తే వచ్చేదీలేదు.
60. ఇస్తే పెండ్లి, ఇవ్వకపోతే పెటాకులు. (పెడాకులు).
61. ఇస్తే వరం, పెడితే శాపం.
62. ఇస్తే హిరణ్యదానం, ఇవ్వకపోతే కన్యాదానం.
63. ఇహం పరం లేనమ్మ, ఇచ్చినచోటే ఉండమ్మా.
64. ఇహం మన్ను, పరం పైడి.
65. ఇహమూ పరమూ లేని మొగుడు ఉంటేనేమీ పోతే నేమి?




66. 'ఈ' (ఇవ్వు)అన్నది ఈ ఇంటలేదు, 'తే' అన్నది తరతరాలుగా వస్తున్నది.
67. ఈ ఇంట ఆచారమా? మా గ్రహచారమా?
68. ఈ ఊరికావూరెంత దూరమో, ఆ వూరికి ఈ ఊరూ అంతే.
69. ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు (తాడిచెట్లు, దాతలెవరంటే చాకళ్ళు.
70. ఈ ఎద్దు ఆ ఎద్దు జోడు, (అయితే) ఈ చేను ఆ చేను బీడు.
71. ఈ కంటికి రెప్ప దూరమా?
72. ఈకలు తీసిన కోడి, ఈన(నె)లు తీసిన మాల.
73. ఈకెలు తోకలు దులిపి, నూకలలో కలిపినట్లు.
74. ఈకలు లేవుఇగానీ, వింజమూరి పుంజే.
75. ఈ కష్టాలకన్నా మా అత్త పెట్టే కష్టాలే బాగున్నాయి అన్నదిట.
76. ఈ కీలు మళ్ళితేనే ఆ కీలు మళ్ళుతుంది.
77. ఈగ పుండు మీద గంటు పెడుతుందిగానీ, గట్టి వంటి మీద వాలదు.
78. ఈగ వ్రణం కోరు, నక్క పీనుగ కోరు.
79. ఈగను కప్ప మింగితే, కప్పను పాము మింగుతుంది.
80. ఈ గుడి నేను కట్టించలేదు, ఆ గుడి ఎవరు కట్టించారో నేనెరుగను అన్నాడుట.
81. ఈ చేత చేస్తారు, ఆ చేత అనుభవిస్తారు.
82. ఈ జొన్నకూటికా ఈ స్తోత్రపాఠం?
83. ఈటెపోటు మానుతుంది కానీ, మాటపోటు మానదు.
84. ఈడిగవాని ఇంట్లో పాలు తాగినా కల్లే అంటారు.
85. ఈడుగానిది ఇంటికిరాదు, జోడుగానిది దొడ్డికి రాదు.
86. ఈడుచూసి పిల్లనియ్యి, పిడిచూసి కొడవలియ్యి.
87. ఈడ్పుకాళ్ళు, ఈడ్పుచేతులూ, ఇతడేనమ్మా ఇల్లిటపుటల్లుడు.
88. ఈడ్పుకాళ్ళవానికి ఇద్దరు భార్యలు, ఒకతి ఈడవ, ఇంకొకతి ఏడవ.
89. ఈతకట్టెల నిప్పు ఇంటికి రాదు, ఈడిగవాని పెండ్లాము చేతికి రాదు.
90. ఈతకు మించిన లోతులేదు, గోచీకి మించిన దరిద్రం లేదు.
91. ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగినట్లు.
92. ఈతచెట్టు ఇల్లుకాదు, తాటిచెట్టు తల్లికాదు.
93. ఈతచెట్టు కింద (తాటిచెట్టు)పాలి తాగినా కల్లే అంటారు.
94. ఈతనీళ్ళు పడితే పాతజోళ్ళు వెళ్ళుతవి; ఇప్పనీళ్ళు (నీళ్ళు--కల్లు) పడితే ఎప్పటిజోళ్ళైనా వెళ్ళుతవి.
95. ఈతవచ్చిన వానికే జలగండం.
96. ఈతవచ్చినప్పుడు లోతనిపించునా?
97. ఈనగాచి నక్కలపాలు చేసినట్లు.
98. ఈనిన పిల్లికి ఇల్లూ వాకిలి తెలియనంత ఆకలి.
99. ఈనిన పులికి ఆకలెక్కువ.
100. ఈనాడు ఇంటిలో, రేపు మంటిలో.

Tuesday, October 5, 2010

సామెతలు-6

1. ఇంటికి ముసలి కీడు, ఏటికి మొసలి కీడు.
2. ఇంటికి హేళనైతే బంటుకు హేళన, బంటుకు హేళనైతే బంచకూ హేళన.
3. ఇంటికూటికీ, దోవకూటికి రెంటికి చెడినట్లు.
4. ఇంటికూడుతిని ఱంకు మొగుళ్ళ వెంటపడినట్లు.
5. ఇంటి కోడళ్ళు తిన్నా కోళ్ళు తిన్నా వృధాగా పోదు.
6. ఇంటి గుట్టు పెరుమాళ్ళ కెరుక.
7. ఇంటిగుట్టు లంకకు చేటు.
8.ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే, మీసాలన్నీ తెగకాలినవట.
9. ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
10. ఇంటినిండా కోళ్ళున్నా పక్కింటి కోడే కూయాల్సి వచ్చింది.
11. ఇంటిపిల్ల ఇగిలిస్తే, లంజపిల్ల గంజికేడ్చిందట.
12. ఇంటికి పెద్దకొడుకై పుట్టేకన్నా, అడవిలో తుమ్మదుబ్బై పుట్టేది మేలు.
13. ఇంటికి పెద్దకొడుకు, పెద్దాల్లుడే లెక్కబడేది.
14. ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల (పెంట) కంపు.
15. ఇంటిపేరు క్షీరసాగరం వారు, ఇంట్లో మజ్జిగచుక్కకు గతిలేదు.
16. ఇంటిమగనికి ఈచ(త) కట్లు, బయటి మొగనికి తాటికట్లు.
17. ఇంటిమగనికి ఎద్దుబండి, బయటి మొగనికి గుఱ్ఱలబండి.
18. ఇంటిమీద రాయి వేసి, వీపు ఒగ్గినట్లు.
19. ఇంటిమొగుడు కుంటెనకాడైతే (తార్పుడుకాడు) ఱంకుకు రామేశ్వరం పోవలెనా?
20. ఇంటిమొగుడు మట్టిగబ్బు, పొరుగింటి మొగుడు పూలవాసన.
21. ఇంటిలక్ష్మిని ఇంటివాకిలి చెబుతుంది.
22. ఇంటివాడివలే చేసేవాడులేడు, బయటివాడివలే తినేవాడూ లేడు.
23. ఇంటివాడు 'ఇలో' అంటే బయటివాడు 'పొలో' అన్నాడుట.
24. ఇంటివాడు ఈకన కొడితే, బయటివాడు పోకన కొడతాడు.
25. ఇంటివాడు గొడ్డు గేదంటే పొరుగువాడు పాడిగేదె అన్నట్లు.
26. ఇంటివాడు లేచేది కుంటివాడిమీదకే.
27. ఇంటివాణ్ణి లేపి దొంగచేతికి కట్టె ఇచ్చినట్లు.
28. ఇంటివానికి చులకనైతే బయటవానికి చులకన, బానిసవానికీ చులకన.
29. ఇంటివారు 'ఒసే' అంటే బయటివారు 'తసే' అంటారు.
30. ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలుచూపుతారు.
31. ఇంటిసొమ్ము విప్ప పిండి, పొరుగింటి సొమ్ము పొడిబెల్లం.
32. ఇంటెద్దుకు బాడిగలేదు.
33. ఇంట్లో ఇత్తులు లేవూ, ఇద్దఱికీ మాటలు లేవు. (భార్యాభర్తలకు)
34. ఇంట్లో ఇల్లాలి పోరు, బయట బాకీల పోరు.
35. ఇంట్లో ఈగపులి (పిల్లి) బయట (పెద్ద) పులి.
36. ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోత.
37. ఇంట్లో కందిరీగలు తిట్టెలు పెడితే, ఇల్లాండ్రు గర్భవతులౌతారట.
38. ఇంట్లో దేవుణ్ణి వదిలి వీధిలో దేవుడికి మొక్కినట్లు.
39. ఇంట్లోనుంచి తోసివేస్తున్నా చూరుపట్టుకుని వేల్లాడినట్లు.
40. ఇంట్లో పస్తు, వీధిలో దస్తు.
41. ఇంట్లో పులి బయట పిల్లి
42. ఇంట్లో పుష్టి ఒంట్లో పుష్టి
43. ఇంట్లో మొగుడు కొడితే వీధిలో మాధాకవళంవాడు కొడతాడు.
44. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు.
45. ఇంతేనా బుద్ధులు కుఱ్ఱవాడా అంటే కడమవి కావిళ్ళతో వస్తున్నావి అన్నాడట.
46. ఇందమ్మా తియ్యకూర అంటే, ఇందమ్మా పుల్లకూర అన్నట్లు.
47. ఇక పుట్టెనా పెరిగేనా, పన్నెండేండ్ల బాలాకుమారుడా ఇంట్లోనే ఏరుగు.
48. ఇక్కడ మునిగి అక్కడ తేలేవాడు.
49. ఇక్కడా అక్కడా ఇంటే ఈడేరిపోతావు, నా ఇంటికి రావే నవసిపోదూగాని.
50. ఇగిరిపోయిన చెంపలకు ఇప్ప (విప్ప) నూనె పెడితే, సానిదాని ముఖం నవనవలాడిందట.
51. ఇగురం (పొదుపు) ఇల్లలికితే, నెత్తి పొయ్యలుకుతుంది.
52. ఇగురం ఇల్లు అలికితే పిఱ్ఱలు ముగ్గు పెట్టినాయట.
53. ఇగిరం తప్పిన దాని ఇంటి వెనుక చూడు, ఒగ్గెం (నేర్పు) తప్పినదాని వంట ఇల్లు చూడు.
54. ఇగిరం తప్పిన పనికి ఊరట లేదు.
55. ఇ(వి)చిత్రాల పెండ్లికొడుక్కి అక్షింతలు పెడితే, నొసలు గులగుల అని నోట్లో వేసుకున్నాడంట.
56. ఇచ్చకాలకు ఉచ్చ తాగితే గత్తు(చ్చు)కంపు కొట్టిందట.
57. ఇచ్చకాలవారు, బుచ్చకాలవారు,పొట్టలకొరకు పొక్కులు గోకుతారు.
58. ఇచ్చింది ఇచ్చి పుచ్చినదాన్ని కొన్నట్లు.
59. ఇచ్చింది ఇస్తే కరణాన్ని కాదు అన్నాడట.
60. ఇచ్చితినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్టు.
61. ఇచ్చి తిరిగేది కోమటి, తీసుకొని తిప్పేది కంసాలి.
62. ఇచ్చిత్రపు పచ్చి పులుసు, ఇస్తర మింగిందట.
63. ఇచ్చిన నిష్టూరం కంటే ఇవ్వని నిష్టూరమే మేలు.
64. ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకొన్నమ్మ పులి.
65. ఇచ్చినవాడు కుక్క, (పిల్లను) చేసుకున్న వాడు చుక్క.
66. ఇచ్చినవాడు తలమీద, ఇవ్వనివాడు నేలమీద.
67. ఇచ్చినవాడు దాత, ఇవ్వనివాడు రోత.
68. ఇచ్చినవాడే నచ్చినవాడు, చచ్చినవాడే అచ్చినవాడు.
69. ఇచ్చిననాడు ఇంత పీనుగ వెళ్ళినట్లు, పుచ్చుకున్ననాడు పుత్రకామేష్టి.
70. ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే వ్యవహారం, వచ్చిపోతూ ఉంటే బాంధవ్యం.
71. ఇచ్చే గొడ్డునే పితికేది.
72. ఇచ్చేటప్పుడు కాముని పండుగ, పుచ్చుకునేప్పుడు దీపావళి పండుగ.(అప్పు)
73. ఇచ్చేవాడు తీసుకునే వాడికి లోకువ.
74. ఇచ్చేవాడిని చూస్తే చచ్చేవాడైనా లేస్తాడు.
75. ఇచ్చేవానికి పత్రమూ వద్దు, చచ్చేవానికి మందు వద్దు.
76. ఇటిటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు.
77. ఇటుకులాడికి రవిక పెడితే, కంపకు పెట్టి చింపుకున్నదట.
78. ఇటువేస్తే హనుమంతుడు, అటువేస్తే వీరభద్రుడు.
79. ఇట్లైతే వైద్య కట్నం, అట్లైతే వైతరణీ గోదానం.
80. ఇడిసిన గుద్ద వీధికి పెద్ద.
81. ఇతరులెరుగ కున్న ఈశ్వరుడెరుగడా.
82. ఇత్తడి పుత్తడికాదు, తొత్తు దొరసానీ కాదు.
83. ఇది ఇట్లా, మొగుడట్లా, సేద్యగాడికి సంకటెట్లా?
84. ఇదిగో సున్నం అంటే, అదిగో వెన్న అంటారు.
85. ఇదిగో పసుపు, అదిగో ముసుగు. ( అంత తొందరగా ముండ మోసినదనటం).
86. ఇదిగో పులి అంటే, అదిగో తోక అనట్లు.
87. ఇదిగో పాము అంటే అదిగో పడగ అన్నట్లు.
88. ఇద్దరు ఒక చోట ఏకాంతమాడగా మధ్యన చేరేవాడు వట్టి వెధవ.
89. ఇద్దఱుకూడితే, ఇంగలం లేకుండానే మండుతుంది.
90. ఇద్దఱు దెబ్బలాడితే మూడవవాడికి లాభం.
91. ఇద్దరు పెళ్ళాల మొగుడు ఇఱుకునపడి చచ్చాడుట.
92. ఇద్దరు పెద్ద మనుషులు ఎదురుపడితే మూడుదారులు, ఒకపెద్దమనిషి ఇంకొక మూర్ఖుడు ఎదురుపడితే రెండుదార్లు, ఇద్దరూ మూర్ఖులైతే ఒకేదారి.
93. ఇనుపకుండ పగిలితే అతకవచ్చునుగాని, మట్టికుంద పగిలితే అతకలేము.
94. ఇనప గుగ్గిళ్ళుగానీ. మినప గుగ్గిళ్ళు కావు.
95. ఇనుము కరగేచోట ఈగలకేమి పని?
96. ఇముము విరిగితే అతక వచ్చును గాని, మనసు విరిగితే అతకలేము.
97. ఇన్ని కంతులు కోశాను గానీ, నా కంతి అంత నొప్పి మరేదీ లేదు.
98. ఇప్పపూలకు వాసన వెతుకవలెల్నా?
99. ఇయ్యగల ఇప్పించగల అయ్యలకేగాని, మూతిమీసం అన్యులకేల?
100. ఇరుగింటమ్మా! ఇరుగింటమ్మ! మా ఇంటాయన గోడు చూడండమ్మా ! అన్నట్లు.

Sunday, October 3, 2010

సామెతలు-5

1. ఆలికి లొంగినవాడు ఆరగాణిలో పడినవాడు అటిటు అవుతాడు.
2. ఆలితో కలహించి ఆకలికాదని పస్తుండెడివాడు పంజు వెధవ. 
3. ఆలిని అదుపులో పెట్టలేనివాడు, అందరినీ అదుపులో పెట్టునా?
4. ఆలిని విడిస్తే హరిదాసు, సంసారం విడిస్తే సన్యాసి.
5. ఆలి పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ భారతం.
6. ఆలిమాట విన్నవాడు, అడవిలో పడ్డవాడు ఒకటే.
7. ఆలివంకవారు ఆత్మబంధువులు, తల్లివంకవారు తగినవారు, తండ్రివంకవారు దాయాదులు.
8. ఆలి శుచి ఇల్లు చెపుతుంది.
9. ఆలు ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం ముందుకురావు. 
10. ఆలి ఒల్లక అరవై ఏళ్ళు, మొగుడుఒల్లక ముప్పై ఏళ్ళు, బాలప్రాయం పదేళ్ళు.
11. ఆలుబిడ్డలు అన్నానికి ఆకోరిస్తుంటే, లంజకు బిడ్డలులేరని రామేశ్వరం పోయినాడు.
12. ఆలు బెల్లమాయె, తల్లి విషమాయె.
13. ఆలు మంచిది కాకున్న ఆరుబిడ్డల తల్లినైనా విడవాలి.
14. ఆలుమగల కలహం అద్దంమీద పెసరగింజ ఉన్నంతసేపే.
15. ఆలుమగల కలహం, అన్నం తినేదాకానే.
16. ఆలుమగల కలహం అరికకూడు వండినంతసేపు.
17. ఆలుమగలొకటయ్యేవఱకే అందఱితో అవసరం (పని).
18. ఆలుమగని సందు ఆరామడల దూరం.
19. ఆలు లేత, నారు ముదురు కావాల.
20. ఆలు లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం.
21. ఆలు లేనివానికి హనుమంతరాయని గుడి, బిడియమిడిచినవాడికి వీరప్ప గుడి శరణ్యం.
22. ఆలు సొత్తు, అత్త తొత్తు.
23. ఆవగింజ అట్టే దాచి గుమ్మడికాయ కుప్ప మీద వేసినట్టు.
24. ఆవగింజకు సందు ఉంటే, అఱవై గారెలు అప్పుడే తిననా (లాగించనా)
25. ఆవాలు తిన్నమ్మకు యావ, ఉలవలు తిన్నమ్మకు ఉలుకు.
26. ఆవు ఎక్కడ తిరిగితేనేమీ? ఇంటికివచ్చి కడివేస్తే (పాలిస్తే) చాలు.
27. ఆవు చేల్లో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?
28. ఆవు తొలిచూలు, గేదె మలిచూలు
29. ఆవు నలుపైతే పాలు నలుపా?
30. ఆవునిచ్చి పలుపు దాచినట్లు.
31. ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు.
32. ఆవును విడిచి గాడిద పాలు పితికినట్లు.
33. ఆవు పొదుగులోనే అరవైఆరు పిండివంటలున్నయి.
34. ఆవురంగు పాలనిబట్టి తెలుస్తుందా?
35. ఆవులన్నీ ఇచ్చి ఒక్క బక్కఆవును ఇవ్వకపోతే పాడికి కొరవా?
36. ఆవుల మళ్ళించినవాడే అర్ర్జునుడు.
37. ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి.
38. ఆవులింతకు అన్నలున్నారుగానీ, తుమ్ముకు తమ్ముళ్ళు లేరు.
39. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు.
40. ఆవులు ఆవులు పోట్లాడుకొని లేగలకాళ్ళు విరగ కోట్టినట్లు.
41. ఆవులేని ఇంట అన్నమే తినరాదు.
42. ఆవూరి వారి అంబలి తాగి దూవూరివారి దూడలు కాచినట్లు.
43. ఆవేళకి అడ్డదిడ్డంగా తిరిగితే, సంకురేతిరినాటికి చంకనాకి పోతారు.
44. ఆవో! అంటే అర్ధంకాక చస్తుంటే, ఖడో అనేదాన్ని అంటగట్టావా?
45. ఆశ అరవై నాళ్ళు, మోహం ముప్పైనాళ్ళు.
46. ఆశ ఆలిమీద, పడక చాపమీద.
47. ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు.
48. ఆశకు అంతులేదు, నిద్రకు సుఖం లేదు.
49. ఆశకు అంతులేదు, నిరాశకు చింత లేదు.
50. ఆశకుపోతే గోచీ ఊడిందట.
51. ఆశకు మించిన దూరం, వడ్డీకి మించిన వేగం లేవు.
52. ఆశకు ముదిమి లేదు, ఆర్ధికి సౌఖ్యం లేదు.
53. ఆశకు దరిద్రానికి లంకె
54. ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు.
55. ఆశకలిగిన చోట ఆడినదే సరసం.
56. ఆశపడి పాసినన్నం తింటే పాడుపడి పదిలంఖణాలు చేసినట్లు.
57. ఆశపడి వెల్లుల్లి తిన్నా, రోగం అల్లాగే ఉంది.
58. ఆశబోతు బాపడు పాతగోచీలో ముప్పందుం మూటకట్టుకున్నాడుట.
59. ఆశబోధిస్తున్నది, అవమానం భాదిస్తున్నది.
60. ఆశలేని కూటికి ఆరళ్ళు లేవు.
61. ఆశ సిగ్గెఱుగదు, నిద్ర సుఖమెఱుగదు.
62. ఆశ్లేషలో ఊడ్పు ఆరుగురి (ఆరింతల) ఊడ్పు.
63. ఆశ్లేషలో ముసలి ఎద్దు కూడా ఱంకె వేస్తుంది.
64. ఆశ్లేష ముసలి కార్తె, ఆగిఆగి తుంపర కురియును.
65. ఆశ్లేషలో ఆడుగుకొక చినుకైనా, అడిగినన్ని వడ్లు.
66. ఆశ్లేషలో ఊడ్చినట్లైతే అడిగినంత పంట.
67. ఆశ్లేషలో తడిస్తే ఆడది మొగాడౌతాడు.
68. ఆశ్లేషలో పూచిన, అంతులేని పంట.
69. ఆశ్లేష వర్షం అందరికీ లాభం.
70. ఆషాఢమాసంలో అరిశలు వండను పొద్దుండదు.
71. ఆషాఢమాసానికి ఆకుపోతలు (నారుమళ్ళు).
72. ఆషాఢానికి పిషాణాలు బద్దలగును.
73. ఆసత్తకు బోసత్త (బోసి+అత్త), బోసత్తకు బోడిమొగుడు.
74. ఆసనంలో పుండు, అల్లుని వైద్యం.
75. ఆసనాలు వేస్తే పాసనాలు పుట్టినట్లు.
76. ఆసలు విడిస్తే అటమట లేదు. 
77. ఆసాది కూతలకు అర్ధంలేదు, గుడ్డి కంటికి చూపూ లేదు.
78. ఆస్థి కలిగిన అన్నంభట్టు ఆలిపక్కనపడుకొని అరుణం చదివెనట.
79. ఆస్థికొక కొడుకు, ఆశకొక కూతురు.
80. ఆస్థికొక పుత్రుడు, ప్రేమకొక పుత్రిక.
81. ఆహారం పట్ల, వ్యవహారం పట్ల మొగమాటం (సంకోచ) పడరాదు. 



82. ఇంకే చెరువుచేపలకు కొంగను కాపుంచినట్లు.
83. ఇంగువ కట్టిన గుడ్డ, బెల్లం వండిన పొయ్యి.
84. ఇంట ఆచారత్వం (ఆచారం), బయట బడాచోరత్వం (చౌర్యం).
85. ఇంట కుడిచి, ఇంటివాసాలు లెక్కించినట్లు.
86. ఇంట గెలిచి రచ్చ గెలువు.
87. ఇంటింటా ఒక ఇటుకపొయ్యి, మాఇంట ఒక మట్టిపొయ్యి.
88. ఇంటి ఎద్దుకు బాడిగ ఏమిటి?
89. ఇంటికన్నా గుడి పదిలం.
90. ఇంటికళ ఇల్లాలే చెబుతుంది.
91. ఇంటికి అవ్వ కొలతకు తవ్వ అవసరం.
92. ఇంటికి ఆడపిల్ల ముప్పు, దోడ్డికి వారసప్రం ముప్పు.
93. ఇంటికి ఆడుబిడ్డ చేటు, మిద్దెకు పూరిపంచ చేటు.
94. ఇంటికి ఇత్తడి చిలుక, బయటకి బంగారు చిలుక. 
95. ఇంటికి ఈలకత్తి, పొరుగుకు బంగారు కత్తి.
96. ఇంటికి ఏబ్రాసి, పొరుగుకు శ్రీమహాలక్ష్మి.
97. ఇంటికి గుప్పెడు బియ్యం, ఇల్లాలికి పదిపుట్లు (పూటలు).
98. ఇంటికి ఒక పువ్వు, ఈశ్వరుడికోక దండ.
99. ఇంటికి గుట్టు, మడికి గట్టు.
100. ఇంటికి జేష్టాదేవి, పొరుగుకు శ్రీమహాలక్ష్మి. 

Saturday, October 2, 2010

సామెతలు-4

1. అల్పుని చేర్చిన అధిక ప్రసంగం, కుక్కని ముద్దు చేసిన మూతి నాకుడు.
2. అల్లం అంటే తెలియదా బెల్లం మాదిరి పుల్లగా ఉంటుంది అన్నాడుట.
3. అల్లుడికి చేసిన పప్పు అతిధికిగూడా పనికి వచ్చినట్లు.
4. అల్లుడికి పెట్టినట్లు కొడుకుకి పెడితే ఇల్లు గుల్ల అయ్యింది.
5. అల్లుడిని చూసి 'ఈయన నా కూతురి మొగుడూ తోడి పెండ్లికొడుకును చూసి 'ఈయన నా మొగుడు, ఆరు నెలల నుంచి ఉన్నాడూ అన్నడుట.
6. అల్లునికి అత్తాశ, గొడ్డుకు దూడాశ.
7. అవతల వీధిలో అల్లరి ఏమిటి అంటె అరవల ఏకంతం అన్నట్టు.
8. అవలక్షణవంతుడికి అక్షతలిస్తే అవతలకెళ్ళి నోట్లో వేసుకున్నాడట.
9. అవవలసింది అయ్యింది ఆదెమ్మా అంటే, కోక సద్దుకోవే గుబ్బలమ్మ అన్నదిట.
10. అవ్వ కోడి కుంపటి లేకుంటే తెల్లవారదా ఊరికి నిప్పుదొరకదా?
11. అవ్వ తీసిన గంధం తాత బుడ్డకు సరిపోయినట్లు!
12. అవ్వ వడికిన నూలు తాత మొలత్రాటికి సరి.
13. అవ్వా కావాలి బువ్వా కావాలి.
14. అశ్వమేధయాగం చెయ్యవచుగానీ, ఆడపిల్ల పెళ్ళి చెయ్యలేము.
15. అశుద్ధం మీద (ఫెంటమీద) రాయి వేస్తే, ముఖమంతా చిందుతుంది.
16. అసత్యమాడుట పిరికిపందల గుణం.
17. అసలుకంటే వడ్డి ముద్దు.
18. అసలుకు గతిలేకుంటే కొసరడిగినట్లు.
19. అసలు మూడుపాళ్ళు, వడ్డి ఆరుపాళ్ళు.
20. అసలే కోతి, దానికితోడు కల్లుతాగింది: పైన తేలు కుట్టింది.
21. అసలే సోమిదేవమ్మ, ఆపైన వేవిళ్ళు.
22. అసాద్యమ్మనేమాట సత్యహీనులది.
23. అసూయ పొరుగింటి గుఱ్ఱాన్ని గాడిద అనిపిస్తుంది.
24. అసూయ ముందు, ఆడది వెనుక.
25. అస్తమానం అరచే పిల్లి ఎలుక పట్టలేదు.
26. 'ఆఁ' అంటే అపరాధము. 'ఊ' అంటే ఉపరాధము; నారాయణా అంటే బూతుమాట.
27. 'ఆఁ' అంటె ఆరునెలలు.
28. 'ఆఁ' అంటే అలసిపోతుంది, 'ఊ' అంటే ఊపిరిపోతుంది.
29. ఆ ఇంటికి తలుపులేదు, ఈ ఇంటికి దారబంధములేదు.
30. ఆ ఇంటికి దడిలేదు, ఈ ఇంటికి గడిలేదు.
31. ఆ ఇంట్లొ తారాడే బాలవితంతువు మీ భార్యా? మీ అన్న భార్యా? అని అడిగినాడట.
32. ఆ ఉరుముకు ఈ చినుకులేనా?
33. ఆ ఊరుకి ఈ ఊరు ఎంతదూరమో, ఈ ఊరికా ఊరు అంతే దూరం.
34. ఆకలని రెండు చేతులతో తింటారా?
35. ఆకలి ఆకాశమంత నోరు సూదిబెజ్జమంత.
36. ఆకలి ఎత్తుతున్నది అత్తగారు అంటే రోకలి మింగవే కోడలా అన్నదిట.
37. ఆకలి కాకుండా నీకు మందుచెబుతా, ముందు నాకు కాస్త గంజి నీళ్ళు పోయమన్నట్లు.
38. ఆకలి గొన్నమ్మ ఎంగిలికి రోయదు.
39. ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదు.
40. ఆకలి రుచెరుగదు, వలపు సిగ్గెరుగదు.
41. ఆకారం చూసి ఆశపడ్డానే గాని అయ్యకు అందులో పస లేదు.
42. ఆకాశానికి నిచ్చెన వేసినట్లు.
43. ఆకుపోయి నూతబడితే, వెతుకబోయి ఏడుగురు పడ్డారుట.
44. ఆచారం ఆరుబారలు, గోచిపాత మూడుబారలు.
45. ఆచారానికి అంతంలేదు, అనాచారానికి ఆది లేదు.
46. ఆటా పాటా మా ఇంట, మాపటి భోజనం మీ ఇంట.
47. ఆడకాడక సమర్తాడితే, చాకలోడు కోక ఎత్తుకుపోయినాడుట.
48. ఆడదానికి అలుసిస్తే నెత్తికెక్కుతుంది.
49. ఆడదానికి మగవాడు, అప్పులవాడికి షాహుకారు మొగుళ్ళు.
50. ఆడదాని నోటిలో నువ్వుగింజ నానదు.
51. ఆడదానికి పురిటి పురిటికీ గండం, మగవానికి దినదినము గండం.
52. ఆడదాని బ్రతుకు అరటాకు బ్రతుకు వంటిది.
53. ఆడదన్ని చూచినా అర్ధాన్ని చూచినా బ్రహ్మకైన పుట్టు ఱిమ్మతెగులు.
54. ఆడది తిరిగి చెడును, మగవాడు తిరగక చెడును.
55. ఆడది బొంకితే గోడ పెట్టినట్లును, మగవాడు బొంకితే తడిక పెట్టినట్లును.
56. ఆడబిడ్డ అర్థ మొగుడు.
57. ఆడబోతె చూడ బుద్ధి, చూడబోతే ఆడబుద్ధి.
58. ఆడబోయిన తీర్థం ఎదురయినట్లు.
59. ఆడవారికి ఆవకాయ, మగవారికి బోడి టెంకలు.
60. ఆడలేక పాత గజ్జలు అన్నట్లు.
61. ఆడలేక అంగణం వంకర అన్నట్లు.
62. ఆడలేనమ్మ మద్దెల ఓడన్నట్లు.
63. ఆడింది ఆట, పాడింది పాట.
64. ఆడుది నీతి తప్పిన తరువాత, అంతేమిటి, ఇంతేమిటి?
65. ఆడే కాలు పాడే నోరు ఊరకుండవు.
66. ఆ తండ్రి కొడుకు కాదా?
67. ఆ తానులోదే ఈ పీలిక.
68. ఆత్రానికి అమ్మబోతె అడివి, కొనబోతే కొరివి.
69. ఆత్రానికిపోతే ఆడపిల్ల పుట్టిందట.
70. ఆదర్శాలు శిఖరమెక్కికూర్చుంటే, అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి.
71. ఆదారి ఎక్కడికి పోతుందీ అంటే, ఎక్కడికీపోదు. నేను పుట్టిందిమొదలు యిక్కడనే ఉంది-అన్నట్లు.
72. ఆదిలోనే హంసపాది (దు).
73. ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు.
74. ఆపదలో అడ్డుపడేవాడే చుట్టము.
75. ఆముదపు విత్తులు ఆణిముత్యాలగునా?
76. ఆముదముకొలిచే తవ్వ ఎప్పుడూ జిడ్డే.
77. ఆమె పేరు కుంతలమ్మ, చూడబోతే బట్టతల.
78. ఆయన ఉంటే మంగలినైనా పిలుచుకొచ్చేవారు కదా అని వాపోయినట్లు.
79. ఆయాసం ఒకరిది అనుభవం ఇంకొకరిది.
80. ఆయువు గట్టిదైతే అన్నీ పోతవి.
81. ఆయుస్సులేక చస్తారు గానీ ఔషదం లేక గాదు.
82. ఆయుస్సు తీరినవాడు ఆరునెలకి చస్తే, అనుమాన పడినవాడు అప్పుడే చస్తాడు.
83. ఆరంభశూరునికి ఆర్భాటమెక్కువ.
84. ఆరాటపు పెండ్లికొడుకు పేరంటాల వెంటపడ్డాడట.
85. ఆరాటమే గానీ పోరాటం లేదు.
86. అరికకోస్తే ఇల్లంతా గింజలు, దంచితే  దొడ్డి   అంతా పొట్టు.
87. ఆరు ఆఆవులమ్మ మూడు ఆవులమ్మ ఇంటికి నేతికి వెళ్ళిందట.
88. ఆరునెలలకి చచ్చెవానికి అల్ప బుద్ధి పుడుతుంది.
89. ఆరునెలలకు చచ్చేవానికి అరుంధతి కనపడదు.
90. ఆరునెలకి చస్తాడనగా అసలు గుణం మారుతుంది.
91. ఆరునెలలు వాయించిన మద్దెల ఓటిదా? గట్టిదా? అన్నట్లు.
92. ఆరునెలలు సహవాసం చేస్తే, వారు వీరవుతారు.
93. ఆరునెలలు సాముచేసి మూలనున్న ముసలమ్మను పొడిచినట్లు.
94. ఆరు రాజ్యాలను జయించవచ్చును గానీ అల్లుడిని జయించలేము.
95. ఆర్భాటపు అత్తగారికి ఆరుగురు మొగుళ్ళు.
96. ఆర్చేవారే గానీ తీర్చేవారు లేరు.
97. ఆలపాటి  కవిత్వం ,   అందులో పైత్యం
98. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
99. ఆలికి అన్నంపెట్టి, ఊరును ఉద్ధరించినట్లనుకుంటాడు
100. ఆలికి గంజిపోయని వాడు ఆచారంచెప్పె; తల్లికి గంజిపోయనివాడు తగవు చెప్పె.